బాబు కుట్రలను ఎదుర్కోవాలి, మోడీ తీరు సరిగా లేదు: కవిత(ఫొటోలు)
హైదరాబాద్: తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, ఉద్యోగుల విభజనతోపాటు ఇతర కీలక అంశాల పరిష్కారం లక్ష్యంగా పార్లమెంటును సమావేశాల తొలిరోజు నుంచే స్తంభింపజేస్తామని టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. తెలంగాణ పట్ల కొన్ని విషయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని ఆమె న్నారు.
తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం టీజీవో భవన్‌లో ‘ప్రభుత్వరంగ సంస్థలలో ఆస్తులు, ఉద్యోగుల విభజన, ఎదుర్కొంటున్న సవాళ్లు- పరిష్కారాలు' అనే అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యమాలు అవసరంలేదని భావించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ ఉద్యమాలను కొనసాగించాల్సిన పరిస్థితులున్నాయని ఎంపీ కవిత అన్నారు. నీళ్లు-నిధులు- నియామకాల కోసం ఉద్యమించిన తెలంగాణ సమాజం నేడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలను ఎదుర్కొనాల్సివస్తుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలన్నీ తెలుగుదేశం, బిజెపిల మధ్య ఉన్న పొత్తు కారణంగానే వస్తున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే బిజెపి తెలంగాణ ప్రజల మద్దతును కోల్పోవాల్సివస్తుందని హెచ్చరించారు. తెలంగాణ సాధన కోసం తపించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ అభివృద్ధి తప్ప.. వేరే ధ్యాసలేదని తెలిపారు.

మంగళవారం నుంచి జరుగనున్న పార్లమెంట్ సమావేశాల్లో హైకోర్టు విభజనపై పోరాటం తమ ప్రాధాన్య అంశమని, ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఎంపీలందరికీ మార్గనిర్దేశం చేశారని కవిత తెలిపారు. భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. హైకోర్టు, ఉద్యోగుల విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదన్నారు.
ఫెడరల్ స్ఫూర్తితో రెండు రాష్ర్టాల అభివృద్ధికి తోడ్పాటునందించాల్సిందిపోయి ప్రేక్షకపాత్ర వహిస్తోందని అన్నారు. ఉద్యోగుల విభజనపై ఏర్పాటు చేసిన షీలాబిడే కమిటీ, కమలనాథన్ కమిటీలపై తెలంగాణ ఉద్యోగులకు నమ్మకంలేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆ కమిటీలు చిత్తశుద్ధితో పనిచేయడంలేదన్నారు.












Click it and Unblock the Notifications