'మీ మంత్రులు, కుమార్తె కూడానా': కెసిఆర్‌కు 'దిక్కుమాలిన' వ్యాఖ్య రివర్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన 'దిక్కుమాలిన' వ్యాఖ్యలకు మున్సిపల్ కార్మిక సంఘాల జెఏసి సోమవారం నాడు కౌంటర్ ఇచ్చింది. అలాంటప్పుడు మంత్రులు, ఇతరులు కూడా దిక్కుమాలిన వారేనా అని ప్రశ్నించారు.
కార్మిక సంఘాలను దిక్కుమాలినవిగా పేర్కొన్న సిఎం కేసీఆర్, కొన్నింటికి తన మంత్రివర్గ సభ్యులూ గౌరవాధ్యక్షులుగా ఉన్నారని, వారూ దిక్కుమాలినవారేనని భావిస్తున్నారా? అని జెఎసి ప్రశ్నించింది.
సోమవారం హిమాయత్ నగర్‌లోని ఏఐటియూసి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కార్మికసంఘాలు, రాజకీయ పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
జలమండలి, సింగరేణి, బల్దియా వంటి సంస్థల్లో కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షులుగా మంత్రివర్గ సభ్యులు, ముఖ్యమంత్రి కుమార్తె తదితరులు వ్యవహరిస్తున్నారన్నారు. వారంతా దిక్కుమాలినవారేనని అంగీకరిస్తారా అని ప్రశ్నించారు.

మున్సిపల్ కార్మికుల వేతనాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని చెబుతున్న ముఖ్యమంత్రి, ఆర్టీసీ, బల్దియాల్లో కార్మికుల వేతనాలను ఎందుకు ప్రకటించారో చెప్పాలన్నారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వం తీసుకుంటున్న కక్షపూరిత చర్యలను తక్షణమే నిలిపివేయాలని, తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలన్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించే క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 11వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, 12న పంచాయతీ కార్మికుల చలో హైదరాబాద్, 13న ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications