కానిస్టేబుల్ ఎదుటే కోడలిని చంపేసిన అత్తింటివారు
ఆదిలాబాద్: సైన్యంలో పనిచేస్తున్న కొడుకు కొన్నిరోజుల కిందట ఆత్మహత్య చేసుకోవడంతో కోడలిని అత్తింటివాళ్లు కానిస్టేబుల్ ఎదుటే దారుణంగా హతమార్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మాన్కాపూర్ పరిధిలోని గుండివాగుకు చెందిన పవార్ లక్ష్మణ్, మథురబాయిల కొడుకు మస్నాజీ (32) పశ్చిమ బెంగాల్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్‌గా విధులు నిర్వహించే వాడు.
ఆదిలాబాద్‌కు చెందిన శాలిని(25)తో ఏడాదిన్నర కిందట వివాహమైంది. పశ్చిమబెంగాల్‌లోనే మస్నాజీ ఆర్నెళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పెళ్లి సమయంలో ఇచ్చిన వంట సామగ్రిని తీసుకెళ్తానని బోథ్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై కి శాలిని విన్నవించింది.

సోమవారం అత్తింటివారిని ఎస్సై పిలిచి వంటసామగ్రి ఇవ్వాలని సూచించారు. శాలిని, ఆమె తల్లి సులోచన, కానిస్టేబుల్ సర్దార్‌ను గుండివాగుకు పంపించారు. అక్కడ ఇంటిలోపలికి వెళ్లగానే ముగ్గురిపై అత్తింటివాళ్లు కిరోసిన్ పోశారు. పసిగట్టిన కానిస్టేబుల్ శాలిని, ఆమె తల్లిని బయటకు తీసుకొచ్చాడు.
శాలిని తల్లిని వాహనంలో ఎక్కించాడు. శాలినిని వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించగా అత్తింటివాళ్లు కానిస్టేబుల్ కాలు లాగడంతో ఇద్దరూ కిందపడిపోయారు. మూకుమ్మడిగా శాలినిపై కర్రలతో దాడిచేసి తలపై బండరాయితో మోది చంపేశారు. అత్త, మామతో పాటు మరో నలుగురిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications