మోడీ మరో ఉక్కు మనిషి, కేసీఆర్ వజ్రం: నాగబాబు ప్రశంసలు, జగన్‌పై పరోక్షంగా..
హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌ను ఎదుర్కొనేందుకు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుండగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అవిశ్రాంతంగా శ్రమిస్తూ కీలక చర్యలు చేపడుతున్నారు. నిజాముద్దీన్ ఘటనతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌తోపాటు అనేక చర్యలు తీసుకుంటున్నారు.
Recommended Video

ప్రధాని మోడీ, కేసీఆర్‌పై నాగబాబు ప్రశంసలు..
కరోనా లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో పేదలను, వలస కార్మికులను ఆదుకునేందుకు కూడా దేశంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు పీఎం, ఇటు సీఎంపైనా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నలువైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీనటుడు, జనసేన నేత నాగబాబు ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లపై ప్రశంసల వర్షం కురిపించారు.

మరో ఉక్కు మనిషి మోడీ..
‘భారత దేశాన్ని అగ్ర రాజ్యాంగ నిలబెట్టగలిగే ఒక ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ని ప్రధానిగా చేసుకోలేక పోయాం. కానీ, మన అందరి అదృష్టం మరో ఉక్కు మనిషి మోడీజీని దేశ ప్రధానిగా ఎన్నుకున్నాం.ఇలాంటి ప్రధాన మంత్రి ఇంకో నాలుగు సార్లు ఉంటే ఈ దేశానికి ప్రపంచంలో తిరుగు లేదు. hail@modi' అంటూ నాగబాబు ప్రశంసలతో ముంచెత్తారు. కాగా, దేశంలో లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించిన విషయం తెలిసిందే.

కేసీఆర్ లాంటి లీడర్స్ వజ్రల్లా..
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా ఆకాశానికెత్తేశారు నాగబాబు. ‘ఈ మధ్య కేసీఆర్ మీటింగ్‌లో ఆయన మాటలు వింటుంటే ఆయన మీద అభిమానం పెరిగింది.దేశం రాష్ట్రం అల్లకల్లోలంగా వున్నప్పుడు ప్రజలకి నేనున్నాను అని ధైర్యం చెప్పి సమస్యలని పరిష్కరించే వాడే నిజమైన నాయకుడు.ఏ మాత్రం బాధ్యత లేని కొందరు సీఎంలు ఉన్న దేశం కేసీఆర్ గారిలాంటి లీడర్స్ వజ్రల్లా మెరుస్తారు' అని ప్రశంసించారు నాగబాబు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై పరోక్షంగా విమర్శలు..
కాగా, నాగబాబు వ్యాఖ్యలను గమనించినట్లయితే.. ఏ బాధ్యత లేని కొందరు సీఎంలు అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్, టాలీవుడ్ నటుడు సోనూ సూద్ కూడా కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇతర రాష్ట్రాల కూలీలను ఆదుకుంటామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సోనూ సూద్ స్వాగతించారు. నిజమైన నాయకుడంటూ ప్రశంసించారు.












Click it and Unblock the Notifications