అసంతృప్తితో హరీష్, టీఆర్ఎస్‌లో ముసలం: నాగం
మెదక్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో ముసలం సిద్దిపేట నుంచే పుడుతుందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు హరీష్ రావు నుంచి అసమ్మతి భయం ఉంది కాబట్టే శాసనసభ్యుల సంఖ్య పెంచుకోవడానికి ఇతర పార్టీల ఎమ్మేల్యేలను వాళ్ల పార్టీలో చేర్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శుక్రవారం జరిగిన టీడీపీ, బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీడీపీ నేత రమణ తదితరులు హాజరయ్యారు. మహబూబ్ నగర్ లోని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీట మునిగితే పట్టించుకోని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు మెదక్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని నాగం జనార్దన రెడ్డి విమర్శించారు. అసలు మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణలో ఉందో లేదో హరీష్ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్, బిజెపి ఎంపి అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతేనని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌పై విశ్వాసం లేకపోవడంవల్లే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్క రొక్కరుగా జారుకుంటున్నారని అన్నారు. టిఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వలసలు పెరగడంతో కాంగ్రెస్, బిజెపిలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయన్నారు.
కాంగ్రెస్ నుంచే కాకుండా టిడిపి నుంచి కూడా తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్ నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. బంగారు తెలంగాణ కోసం కొండా సురేఖ, మహేందర్‌రెడ్డి, గోవర్ధన్‌లు టిఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వత్తాసు పలికిన జగ్గారెడ్డి బిజెపిలో చేరారని దుయ్యబట్టారు. మెదక్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి గెలవడం ఖాయమని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పడం మేకపోతు గాంభీర్యానికి నిదర్శనమన్నారు.
ఓటు అడిగే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదు : కిషన్ రెడ్డి
కరెంట్ సమస్యలపై రైతులు ఆందోళన చేస్తే లాఠీచార్జ్‌లు చేయించిన టీఆర్‌ఎస్‌కు మెదక్‌లో ఓటు అడిగే హక్కు లేదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్టే అని ఆయన అన్నారు. సెప్టెంబర్ 17 విమోచనదినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థులపై అక్రమకేసులు పెడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications