సీనియర్లు కొర్రీ: నారా లోకేష్, రేవంత్‌పై వెనక్కి తగ్గిన చంద్రబాబు?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించాలనే ఆలోచన నుంచి పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. సీనియర్లు కొంత మంది వ్యక్తం చేసిన సందేహాల కారణంగా ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
తెలంగాణ పార్టీని నిలపాలంటే సీనియర్లకే బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు అంతా సోమవారం నాడు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. రేవంత్ రెడ్డికి తెలంగాణ పార్టీ పగ్గాలను అప్పగించాలనే ఆలోచన కూడా వెనక్కి వెళ్లినట్లు చెబుతున్నారు. దాంతో లోకేష్ భవితవ్యంపై చంద్రబాబు మళ్లీ ఆలోచనల్లో పడ్డారని తెలిసింది.
ఇదిలావుంటే, పార్టీ జాతీయ కమిటీని బుధవారం నాడు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. 18 మందిని కేంద్ర కమిటీలో నియమిస్తారని విశ్వసనీయంగా తెలిసింది. ఇరు రాష్ట్రాల నేతలతో పాటు ఒరిస్సా, తమిళనాడు, పాండిచ్చేరి, కర్నాటక, అండమాన్ నికోబార్‌లకు చెందిన మరో 10 మందిని కూడా సెంట్రల్ కమిటీలో చేరుస్తారని సమాచారం. ఇరు రాష్ట్రాలకు కమిటీలను నియమిస్తారు.

వీటితో పాటు మరో 16 మందితో పోలిట్‌బ్యూరో నియమిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఎల్ రమణను, ఆంధ్రాకు అధ్యక్షుడిగా కిమిడి కళావెంకటరావును కొనసాగించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎర్రబెల్లి దయాకరరావును నియమించి, శాసనసభా పక్ష నేతగా ఆయన స్థానంలో రేవంత్‌రెడ్డిని నియమించే యోచన కూడా చంద్రబాబునాయుడు చేస్తున్నట్టు తెలిసింది.
గత మూడేళ్లుగా తెలంగాణ టిడిపి వ్యవహారాలన్నింటినీ అతి సమీపం నుండి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల మహానాడు నిర్వహణ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. మే చివరిలో జరిగిన మహానాడు సభల్లోనే చంద్రబాబునాయుడు జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995లో తొలిసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధినేతగా చంద్రబాబునాయుడు బాధ్యతలు స్వీకరించారు. 20 ఏళ్ల తర్వాత 2015లో ఆయన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ క్రమంలోనే గత ఐదేళ్లుగా లోకేష్‌ను పార్టీ ప్రమోట్ చేస్తూ వచ్చింది. దాంతో తెలంగాణ అధ్యక్షుడిగా లోకేష్ ఎన్నికవుతారని అంతా భావించారు. దాదాపు 30వేల మంది అభిప్రాయాలను ఐవిఆర్‌ఎస్ ద్వారా సేకరించారు. అందులోనూ లోకేష్ ఎక్కువ పాయింట్లు దక్కించుకున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు దృష్ట్యా లోకేష్‌కు బదులు మరో సీనియర్ ఉంటే పార్టీ గాడిలో పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications