రావుగారూ! అంటూ కేసీఆర్‌తో మోడీ, బాబుకు ఒకేనని కేసీఆర్, కానీ..
న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ ప్రక్రియకు ప్రధాని నరేంద్ర మోడీ, మిత్రపక్షాల అధినేతలతో హాజరైన విషయం తెలిసిందే. పార్లమెంటు లైబ్రరీ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

రావుజీ అంటూ..
కేసీఆర్ ను చూసిన వెంటనే ‘రావుజీ! రాష్ట్రంలో వర్షాలు బాగా పడుతున్నాయా?' అంటూ ప్రశ్నించారు. ఇందుకు కేసీఆర్.. బాగానే పడుతున్నాయని సమాధానమిచ్చారు. దీంతో ప్రాజెక్టుల వెంటపడటంతోనే వర్షాలు కురుస్తున్నట్టున్నాయని సరదాగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు ఓకే.. మాకే
పక్కనే ఉన్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ప్రధాని పలకరించే సమయంలో వాళ్లకి బాగానే పడుతున్నాయని, తమకు మాత్రం సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడం లేదని కేసీఆర్ అన్నారు. అనంతరం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను కూడా వర్షాలు బాగా కురుస్తున్నాయా? అని ప్రధాని అడిగారు. దీనికి వారు తమ రాష్ట్రాల్లో ఆశించినమేర లేవని చెప్పారు.

లేదంటూ చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటూ.. ఏపీలో వర్షాలు అంతగా కురవటం లేదన్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింగ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. నాలుగు సెట్లలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మొదటి సెట్ పై ప్రధాని మోడీ సంతకం చేయగా, రెండో సెట్‌పై చంద్రబాబు సంతకం చేశారు.

నీటి మనిషి మీరు..
కాగా, కేసీఆర్‌ను ఉద్దేశించి.. ‘మీరు నీటి మనిషి. సాగు, తాగునీటి ప్రాజెక్టులు చేపడుతూ అందరికీ నీళ్లిచ్చే ఆశయంతో పనిచేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తున్నాయి' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.
కాగా, తాము ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ కోవింగ్ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications