ఓరుగల్లులో జాతీయ సంస్కృతి మహోత్సవాలు నేటి నుండే.. ముఖ్య అతిథులుగా వస్తుంది వీరే!!
నేటి నుండి రెండు రోజుల పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను పురస్కరించుకుని దేశ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిన కేంద్రం నిర్వహిస్తున్న జాతీయ సంస్కృతి మహోత్సవాలు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరగనున్నాయి. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక కళాకారుల ప్రదర్శనలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణం ముస్తాబైంది. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ నిర్వహణలో 29,30 తేదీల్లో రెండు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

గవర్నర్ తమిళి సై చేతుల మీదుగా జాతీయ సంస్కృతి మహోత్సవం
జాతీయ సంస్కృతి మహోత్సవాలలో పాల్గొనడం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు రాష్ట్రంలో పేరుగాంచిన కళాకారులు ఎందరో వస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ చేతులమీదుగా ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు, అతిథులు కార్యక్రమాలకు వస్తున్న క్రమంలో అందుకు తగినట్టుగా కేంద్ర సాంస్కృతిక శాఖ అన్ని ఏర్పాట్లను చేసింది.

జాతీయ సంస్కృతి మహోత్సవం ఆరంభానికి బీజేపీ ఆధ్వర్యంలో శోభా యాత్ర
ఈ కార్యక్రమంలో కళాకారులు, ప్రతినిధులను సమన్వయం చేయడం కోసం రాష్ట్రంలోని సౌకర్యంగా ఉన్న ప్రాంతాలను కలుపుతూ ఏడు కల్చరల్ జోన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్లో నాలుగు నుండి ఐదు రాష్ట్రాల వారు ఉంటారు. మొత్తం స్థానిక కళాకారులతో కలిసి వెయ్యి మంది వరకు ప్రదర్శనలు ఇస్తారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరగనున్న జాతీయ సాంస్కృతిక మహోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడు బిజెపి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. వేయి స్తంభాల గుడి నుండి సుబేదారిలో ఉన్న తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు శోభ యాత్ర సాగింది.

ఈ రోజు కార్యక్రమాలు ప్రారంభించనున్న గవర్నర్ ... కార్యక్రమాలు ఇలా ...
ఈ శోభాయాత్రలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మలను ప్రదర్శనగా తీసుకువెళ్లారు. ఇక ఈ రోజు సాయంత్రం నుండి జరగనున్న జాతీయ సంస్కృతి మహోత్సవాల కార్యక్రమాల వివరాలను చూస్తే ముందుగా స్థానిక కళాకారులకు ప్రదర్శన సాగుతుంది. ఐదున్నర గంటలకు నెట్ గెస్ట్ హౌస్ కు గవర్నర్ తమిళిసై వస్తారు. 6 గంటలకు గవర్నర్ ఆర్ట్స్ కళాశాల మైదానానికి వస్తారు. 6 నుండి 6 గంటల 20 నిమిషాల వరకు అంగన్స్, స్వాతంత్ర సమరయోధుల ఎగ్జిబిషన్ సందర్శన ఉంటుంది.

గవర్నర్ ప్రసంగం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు.. రేపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాక
6.20 నుంచి 6. 40 వరకూ కార్యక్రమాన్ని ప్రారంభించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈరోజు కార్యక్రమాలలో కూచిపూడి నృత్య ప్రదర్శన, జానపద నృత్య ప్రదర్శన, హైదరాబాద్ బ్రదర్స్ ప్రదర్శనలు, సుస్వర గ్రూపు ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. రెండు రోజులపాటు అట్టహాసంగా నిర్వహించనున్న సంస్కృతి సంరంభానికి ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చారిత్రక ఓరుగల్లు నగరంలో తొలిసారి వరంగల్ వేదికగా ఈ ఉత్సవాలను నిర్వహించడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక బుధవారం జరిగే ముగింపు వేడుకల్లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సాంస్కృతిక మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications