నయీమ్ మెగా అరాచకం ఇదే: దోపిడీకి ‘ఎన్’ ట్యాక్స్ ప్రత్యేకం
హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్ తర్వాత అతని దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రెండున్నర దశాబ్దాలపాటు సమాంతర పాలన సాగించి భూదందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, బలవంతపు వసూళ్లతో బెంబేలెత్తించిన నయీం.. ఏకంగా తన పరిధిలో 'ఎన్'(నయీమ్) ట్యాక్స్‌ను కూడా విధించాడు.
ఈ పన్ను చెల్లించని వారికి పెనాల్టీ విధిస్తూ చుక్కలు చూపించేవాడు. అంతేగాక, ట్యాక్స్ గడువు దాటితే వ్యాపారం మరుసటి రోజు నుంచి సాగకుండా అడ్డంకులు సృష్టించేవాడు. ఆ వ్యాపారులను నయీం ముఠా నిరంతరం వెంబడించి లొంగదీసుకుంటూ ఉండేది.

ఈ విధంగా నయీం హైదరాబాద్ శివారు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో తన ఎన్ ట్యాక్స్‌ను ఎన్‌కౌంటరయ్యే వరకు యధేచ్ఛగా వసూలుచేశాడు. అంతేగాక, మైనింగ్, ఇసుక వ్యాపారులు, పెట్రోల్‌బంక్‌లు, రైసు మిల్లులు, మరికొన్ని భారీ టర్నోవర్లు ఉండే వ్యాపారాలపై నయీం దృష్టి సారించాడు.
ప్రతినెలా ఈ వ్యాపారుల నుంచి లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు దోచేశాడని తెలిసింది. దీనికోసం నయీం తన నెట్‌వర్క్‌లోని ఏజెంట్లను ఈ వ్యాపారుల వెనుకాల పెట్టి వారి ఆదాయం, వారు చేస్తున్న అక్రమాలపై పూర్తివివరాలను తెప్పించుకుని వ్యాపారులను వేధించేవాడు.
అసలే గ్యాంగ్‌స్టర్.. అతనితో పెట్టుకుంటే ప్రాణాలకే ముప్పని... వ్యాపారులు నెలనెలా మాముళ్లను ఎన్ ట్యాక్స్ పేరున పంపించారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మరోసారి కస్టడీకి ఫర్హానా, అఫ్సానా
నయీం అల్కాపురి డెన్ ఇంఛార్జ్, గన్‌మెన్ ఫర్హానా, మరో అనుచరురాలు అఫ్సానాలను ఆరురోజుల కస్టడీకి రాజేంద్రనగర్ కోర్టు నార్సింగి పోలీసులకు అనుమతినిచ్చింది. అల్కపురిలో నయీం ఇంట్లో పట్టుబడిన వీరు అనేక కీలక విషయాలను వెల్లడించారు. వాటిని ఛేదించేందుకు పోలీసులు కస్టడీ కోరారు. నయీంగ న్‌మెన్ షమీర్‌ఉద్దీన్‌ను హయత్‌నగర్ కోర్టులో హాజరుపర్చి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
నల్గొండ జిల్లాకు చెందిన నయీం అనుచరులు యునీస్, జహంగీర్, జాని, టమాట శ్రీనులను మరోసారి విచారించేందుకు పోలీసులు మంగళవారం కోర్టు నుంచి నాలుగు రోజుల కస్టడీకి అనుమతి తీసుకున్నారు. పాశం శ్రీను అనుచరులుగా భావిస్తున్న యాదగిరిగుట్ట నివాసి పులిరాజు అలియాస్ గుర్రం రాజు, మరో అనుచరుడు చిరంజీవిని సిట్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
కాగా, బుధవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా జైలు నుంచి నయీమ్ భార్య హసీనాబేగం, చెల్లెలు సలీమా బేగంను షాద్ నగర్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వారితో పాటు నయీమ్ బావమరిది అబ్జుల్‌మతిన్, మరో మహిళ ఖలీమా బేగంను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని నయీమ్‌కు సంబంధించిన నేరాలు, పలు అంశాలపై విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications