‘ఇకపై హైదరాబాద్ షాపింగ్ మాల్స్‌లోనూ మద్యం లభించును!’
హైదరాబాద్: ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరంలోని షాపింగ్ మాల్స్‌లో ఇకపై మద్యం కూడా లభించనుంది. దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో ఒకటిగా వెలిగిపోతున్న హైదరాబాద్ నగరంలో వెలిసిన అనేక షాపింగ్‌మాల్స్‌లో అన్ని రకాల వస్తువులు, సరుకులతో వినియోగదారులకు సేవలందిస్తున్నాయి.
కాగా, ఈ షాపింగ్ మాల్స్‌లోనూ మద్యం అమ్మకాలు చేపట్టే అవకాశాలపై తెలంగాణ ఎక్సైజ్‌శాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనలో ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
రూ. వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్ గల షాపింగ్‌మాల్స్‌లో మాత్రమే మద్యం అమ్మకాలకు అనుమతులు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. ప్రధానంగా విదేశీ లిక్కర్ విక్రయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నారు.

రూ. వెయ్యి కోట్ల వార్షిక టర్నోవర్ గల షాపింగ్‌మాల్స్‌లో మద్యం అమ్మకాలకు అనుమతినిస్తే సత్ఫలితాలు వస్తాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వారు నగర పరిధిలోని పెద్దపెద్ద మాల్స్‌లో వ్యాపార లావాదేవీలపై అధ్యయనం కూడా జరిపారు.
తమ అధ్యయనం, నగరంలో షాపింగ్ సంస్కృతి తదితర అంశాల ఆధారంగా షాపింగ్‌మాల్స్‌లో మద్యం అమ్మకాలకు అనుమతించే విషయమై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
కాగా, సుచిత్రా జంక్షన్ వద్ద 100 షాపింగ్ మాల్స్ ఉండేలా ఓ సంస్థ చేపట్టిన నిర్మాణాలు మరో ఆరు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, చందానగర్, మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్, మాదాపూర్ సహా పలు చోట్ల పెద్ద మాల్స్ నిర్మాణానికి కార్పొరేట్లు ప్రయత్నిస్తున్నారు.
ఇవన్నీ పూర్తయితే నగరంలో దాదాపు రెండు వేల షాపింగ్‌మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగర పరిధిలోని 26 రిటైల్ మద్యం దుకాణాల్లో విదేశీ మద్యం విక్రయాలు సాగుతున్నాయి. విదేశీ పర్యాటకులు భారీస్థాయిలో సందర్శిస్తున్న హైదరాబాద్‌లో విదేశీ మద్యం విక్రయాలు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వం గణాంకాలు కూడా పేర్కొంటున్నాయి.












Click it and Unblock the Notifications