అమెరికాలో తెలంగాణ అమ్మాయి హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ కు చెందిన యువతి నిఖిత గోడిశాల (27) హత్య కేసులో కీలక పురోగతి లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ శర్మ (26)ను తెలంగాణ పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే నిందితుడిని దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అయితే అమెరికా పోలీసుల అభ్యర్థన మేరకు నిందితుడిని వారికి అప్పగించే ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. ఇక హైదరాబాద్ లోని లాలాగూడ పోలీసులు నమోదు చేసిన ఓ చీటింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా అతడి ఆచూకీ ఆగ్రాలోని ఓ ఫ్లాట్ లో లభ్యమైనట్లు వివరించారు. మరోవైపు దీన్ని దాదాపు ఎనిమిది నెలల సుదీర్ఘ పోరాట విజయంగా బాధితుల కుటుంబం స్వాగతించింది.
ఏం జరిగిందంటే..?
హైదరాబాద్ లోని లాలాగూడ, విజయపురి కాలనీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తి కుమార్తె నిఖిత గొడిశాల(27) ఉన్నత చదువులు చదివేందుకు నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అయితే ఈ ఏడాది జనవరి 2 న ఆమె మాజీ రూమ్ మేట్, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన అర్జున్ శర్మ.. నిఖిత కనిపించడం లేదంటూ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వెంటనే ఆయన భారత్ కు తిరిగి వచ్చాడు. అయితే అర్జున్ శర్మపై అనుమానం వచ్చిన పోలీసులు జనవరి 3 న అతని అపార్టుమెంట్ లోని ఫ్లాట్ లో తనిఖీ చేశారు. అక్కడ నిఖిత మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటం చూసి షాక్ అయ్యారు. అంతేకాక ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయి. అయితే గతేడాది డిసెంబర్ 31వ తేదీనే ఆమె హత్యకు గురై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని నిఖిత కుటుంబ సభ్యులకు ఆ విషయానని చేరవేశారు.

ఇక నిఖిత తండ్రి ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. తన కుమార్తె నిఖిత వద్ద అర్జున్ అప్పు తీసుకున్నాడని.. ఆ డబ్బును తిరిగి అడిగినందుకే ఆమెను హత్య చేశాడని ఆయన పోలీసులకు ఇచ్చిన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు అర్జున్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అతడు ఆగ్రాలో ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా కనిపెట్టిన పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని దిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఇక అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు నిందితుడిని ఆ దేశానికి అప్పగించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications