జనాలను జోక్ అంటున్నారా?: కేసీఆర్‌పై నిర్మలా సీతారామన్ సీరియస్, స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేంద్రంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కేంద్రమే భారీగా అప్పులు చేస్తోందని, కేంద్రంలో అసమర్థ పాలకులు ఉన్నారంటూ ఘాటుగా విమర్శించారు. తెలంగాణకు అన్యాయం చేస్తోందని కేంద్రంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కేసీఆర్‌కు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

మీ సంగతేంటి?: కేసీఆర్‌పై నిర్మలా సీతారామన్
కేంద్రమంత్రి నిర్మలా సీతారామాన్ మాట్లాడుతూ.. తమపై విమర్శలు చేస్తున్నారు.. మీ సంగతేంటి? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. తాము దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో.. మెడికల్ కాలేజీలు లేని జిల్లాల పేర్లను పంపాలని కేసీఆర్ సర్కారు చెప్పామని తెలిపారు. అయితే, అప్పటికే మెడికల్ కాలేజీలు ఉన్న కరీంనగర్, ఖమ్మం జిల్లాల పేర్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలుగా పంపిందని మండిపడ్డారు.

కేసీఆర్‌కు ఆ విషయం కూడా తెలియదా?: నిర్మలా సీతారామన్ కౌంటర్
తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏ జిల్లాల్లో ఉన్నాయో అనే విషయం కూడా కేసీఆర్‌కు తెలియదా? అని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి డేటా సరిగా ఇవ్వలేదని.. నోడేటా అవలేబుల్ అనేది ఎవరికి వర్తిస్తుందో ఆలోచించండి అంటూ కేసీఆర్ సర్కారుకు నిర్మలా సీతారామన్ చురకలంటించారు.

జనాలను జోక్ అంటారా? అంటూ కేసీఆర్‌పై నిర్మలా సీతారామన్ ఫైర్
అంతేగాక, భారత ఆర్థిక వ్యవస్థపై ఎగతాళిగా మాట్లాడటం సరికాదని నిర్మలా సీతారామన్.. కేసీఆర్‌కు హితవు పలికారు. ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై జోకులు వద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాలను జోక్ అంటున్నారా? అని మండిపడ్డారు. ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలని, ఇది దేశం కోసమేనని అన్నారు. చాలా రాష్ట్రాలు తమతో కలిసి వస్తామని అంటున్నాయని.. కేసీఆర్ మాత్రం వెక్కిరిస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ అప్పులు 60వేల కోట్లు ఉంటే ఇప్పుడు 3 లక్షల కోట్లు దాటాయి!
కాగా, 2014లో తెలంగాణలో అప్పులు రూ. 60 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడు మూడు లక్షల కోట్ల రూపాయలు దాటాయని చెప్పారు నిర్మలా సీతారామన్. రాష్ట్రం చేయనంతగా తెలంగాణలో అప్పులు పెరిగాయన్నారు. కరోనా కారణంగా అందరం అప్పులు తెచ్చుకున్నామని.. ఇప్పుడు అప్పులు తీరుస్తున్నామన్నారు.

ప్రజలను ఎగతాళి చేస్తారా? అంటూ కేసీఆర్‌పై నిర్మలమ్మ సీరియస్
అంతేగాక, రాష్ట్రాలు చేసే అప్పులను పరిశీలించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని నిర్మలా సీతారమన్ స్పష్టం చేశారు. ఇది రాజ్యాంగంలో పొందుపర్చిన నిబంధన అని, దాన్ని తాము అమలు చేస్తున్నామన్నారు. ఎప్ఆర్బీఎం లిమిట్ పైనా ఇప్పటికే అనేకసార్లు సమాధానం చెప్పానని తెలిపారు. పార్లమెంట్ అనేది అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ అని.. ఇక్కడే అనేకసార్లు సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అందరినీ ఒకేలా చూస్తామని.. సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తామన్నారు. పథకాలను జోక్ అంటూ ప్రజలను వెక్కిరిస్తున్నారా? అని కేసీఆర్‌పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రజల కోసం ఉచిత రేషన్ ఇవ్వడాన్ని ఎగతాళి చేస్తారా? అని సీరియస్ అయ్యారు.












Click it and Unblock the Notifications