గడ్కరీని గుర్తుంచుకుంటుంది: చప్పట్లు కొట్టించి బిజెపి నేతకు కెసిఆర్ ప్రశంస
హైదరాబాద్/వరంగల్: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం అన్నారు. సభకు హాజరైన ప్రజలకు చెప్పి మరీ.. గడ్కరీకి చప్పట్లు, హర్షధ్వనాలు పలికించారు.
దీంతో హాజరైన వారు చప్పట్లు, హర్షధ్వనాలు చేశారు. అనంతరం కెసిఆర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వైపు తిరిగి... మీకు తెలంగాణ ప్రజలు చప్పట్లు, హర్షధ్వనాలు పలుకుతున్నారని చెప్పారు.
సోమవారం వరంగల్ జిల్లాలోని మడిగొండలో 163వ జాతీయ రహదారి విస్తరణ పనులకు ఆయన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, కెసిఆర్ కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. ఏటూరు నాగారం-వంతెనను జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి జాతీయ రహదారులను మంజూరు చేసిన నితిన్ గడ్కరీని తెలంగాణ ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్నారు. గడ్కరీ రాష్ట్రానికి 18 వందల కిలోమీటర్ల రోడ్లను మంజూరు చేశారని కొనియాడారు. తెలంగాణలో జాతీయ రహదారులు తక్కువగా ఉన్నాయన్నారు.
తెలంగాణలో వరంగల్ రెండో అతిపెద్ద నగరమన్నారు. వరంగల్‌కు సైనిక్ స్కూల్ వచ్చిందని, వరంగల్ జిల్లాలో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను త్వరగా పునఃప్రారంభించాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో మరిన్ని రైల్వే బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు.
అంతకుముందు నితిన్ గడ్కరీ మాట్లాడుతూ... రహదారుల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమన్నారు. సీఎం కేసీఆర్ కోరిక మేరకు తెలంగాణకు జాతీయ రహదారులు మంజూరు చేశామన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు రూ.16 వేల 500 కోట్లు కేటాయించామన్నారు.
బెంగళూరు-హైదరాబాద్ గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి అనుమతి ఇస్తున్నామన్నారు. భద్రాచలం-కౌటాల వరకు ఉన్న రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తామన్నారు. గోదావరి జలమార్గ ఏర్పాటు విషయంలో తెలంగాణకు సహకరిస్తామన్నారు. తెలంగాణ పూర్తిస్థాయి అభివృద్దికి కేంద్రం సహకరిస్తుందన్నారు. తెలంగాణకు రూ.41వేల కోట్ల ప్రాజెక్టులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications