బీఆర్ఎస్‌కు మరో షాక్: నెగ్గిన అవిశ్వాసం, నల్గొండ మున్సిపాలిటీ ‘హస్త’గతం
నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగా.. తాజాగా, నల్గొండలో అదే జరిగింది. నల్గొండ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానంతో హస్తగతం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ ఛైర్మన్ మందాడి సైదిరెడ్డికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.
సోమవారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో కాంగ్రెస్ పార్టీకి 41 మంది అనుకూలంగా ఓటు వేయగా, బీఆర్ఎస్‌కు ఐదుగురు మాత్రమే ఓటు వేశారు. ఫలితంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కోల్పోయింది.

అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో 8వ వార్డు కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ తటస్థంగా ఉండగా.. బీజేపీకి చెందిన ఓ కౌన్సిలర్ గైర్హాజరయ్యారు. నల్గొండ మున్సిపల్లో మొత్తం 48 వార్డులకు గాను కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 21, బీజేపీ 6, ఎంఐఎం 1, స్వతంత్ర అభ్యర్థి 1 గెలిచినా విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ మున్సిపల్‌ను హస్తగతం చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. కాగా, నల్గొండ మున్సిపాలిటీ ఛైర్మన్ ను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో ఎన్నుకుంటామని ఇప్పటికే మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీని రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications