బాబు తప్పించుకోలేరు, ఆ పార్టీ అవసరమా: హరీష్, బాబుపై ఎంపీ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అవసరమా అని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడి నీళ్లు తాగుతూ తెలంగాణ ప్రాజెక్టులు వద్దనే వారు ఇక్కడ ఎలా ఉంటారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేల తప్పుడు కేసులు పెట్టినా ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోలేడని హెచ్చరించారు. రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ గవర్నర్‌పై ఆరోపణలు చేసిన ఏపీ ప్రభుత్వంను భర్తరఫ్ చేయాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.
పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌లో సెక్షన్-8ను అమలు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బూరా నర్సయ్య గౌడ్ విమర్శించారు. సెక్షన్-8 అనేది చంద్రబాబు నాయుడు చేసే అక్రమాలకు లైసెన్స్ కాదని అన్నారు. ఇక్కడ ఉండి కుట్రలు చేసేందుకు సెక్షన్-8 లేదని తెలిపారు.

తప్పు చేసినప్పటకీ తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారని వివరించారు. ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ నుంచి పది సంవత్సరాలపాటు పాలన చేసుకుంటామంటే అంగీకరించామని తెలిపారు. ఇక్కడ చంద్రబాబుకు డిప్లొమేటిక్ ఇమ్మునిటీ ఉండదన్నారు. సామాన్య మానవునికి వర్తించే చట్టాలే చంద్రబాబుకు వర్తిస్తాయన్నారు.
రాష్ట్రంలో ఇవాళ టీ స్టాల్ దగ్గర నుంచి కల్లు కంపౌండ్ వరకు ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతుందని తెలిపారు. ఈ కేసులో గవర్నర్ పాత్ర ఉంటే మీరు ఎక్కడ ఉండే వారో తెలుసుకోవాలని అన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో మంత్రిని జైలుకు పంపిన విషయాన్ని గుర్తు చేశారు.
ఏసీబీ వాళ్లు ఊకెనే కేసులు నమోదు చేయరని తెలిపారు. స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు ఇచ్చిన సమయంలో పదేపదే మా బాబు, మా బాస్, చంద్రబాబు అని వ్యాఖ్యానించారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications