ప్రాణం పోయినా తప్పు చేయం, జానా రెడ్డి ధన్యజీవి: కెసిఆర్
హైదరాబాద్: అర్ధం కాకపోతే ఆరు నెలలు ఆగుతామే తప్ప అడుగు ముందుకు వేయబోమని, తప్పు చేసే అధికారం తమకు లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అన్నారు. ఇప్పుడు తప్పుటడుగు వేస్తే భావి తరాలు ఇబ్బందులపాలవుతాయని, ఈ క్రమంలోనే దీర్ఘకాలిక చర్యల దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రాణం పోయినా సరే తప్పు చేసే దిశగా అడుగువేయనని స్పష్టం చేశారు.
అవకాశాలు, పదవులు, మనుషులు శాశ్వతం కాదని ఆయన అన్నారు. మాజీ మంత్రి జేవీ నర్సింగరావు(జేవీ) శతాబ్ది జయంత్యుత్సవాలను పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్‌లో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జేవీ విశిష్టతను భావితరాలకు తెలిపేలా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. జేవీతోనే కొన్ని విజయాలు సాధ్యమయ్యాయని ప్రముఖ నేత కొండా వెంకటరెడ్డి అనేవారని, అలాగే వెంకటరెడ్డి వల్లే అవి సాధ్యపడ్డాయని జేవీ అనేవారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ప్రస్తుతం విలువలు దిగజారాయని, ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో కొందరికి తెలియడం లేదన్నారు. రాజకీయాల్లో విపరీతమైన అసహన వైఖరితో వ్యవహరిస్తున్నారని, దేశానికి, రాష్ట్రానికి ఇది మంచిది కాదని, సహనంతో వ్యవహరించాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పీవీని, జేవీని స్మరించుకునేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ కోసం శ్రమించిన ఎందరో వ్యక్తులు ఇంకా తెరమరుగునే ఉన్నారని, జి.వెంకటస్వామి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామని, ఆ సంస్కారం కాంగ్రెస్‌కు ఉంటే ఆయన విగ్రహాన్ని ఎప్పుడో ఆవిష్కరించుకుని ఉండేవాళ్లమన్నారు. ఇక పరిపాలనాదక్షుడు, సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నర్సింహారావు ఒక్కరే మన నుంచి ప్రధాని అయ్యారని, కానీ ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఆయన జయంతి, వర్ధంతిలను అధికారికంగా జరుపుకోలేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతే ఘనంగా జరుపుకుంటున్నామని వివరించారు
తెలంగాణ కావాలని తప్ప, వద్దని ఎవరూ అనలేదని, కొందరు అంటే అని ఉండొచ్చని, అందుకే తెలంగాణ కోసం దశాబ్దాల పోరాటం జరపాల్సి వచ్చిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణను చూసే చనిపోతానని వెంకటస్వామి అన్నారని, ఆయన జన్మ ధన్యమైందని, ఆ అదృష్టం జేవీఎన్‌కు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జానారెడ్డి కూడా ధన్యజీవి అని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications