Bellampally: బెల్లంపల్లి మండలంలో చిరుత సంచారం..
రాష్ట్రంలో పులులు, చిరుతపులుల సంచారం పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో క్రూర మృగాల కదలికలు పెరిగిపోయాయి. గత శుక్రవారం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ మహిళపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. కాగజ్‌నగర్ మండల పరిధిలోని బెంగాలీ క్యాంపు ఆరో నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ పులి దాడిలో తీవ్రంగా గాయపడి మృతి చెందింది. ఆమె పత్తి ఏరడానికి వెళ్లగా.. వెనక నుంచి వచ్చిన పులి దాడి చేసింది.
దీంతో ఆమె కేకలు వేస్తూ కింద పడిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు మహిళ మృతదేహంతో ఫారెస్ట్ ఆఫీస్ ముందు బైఠాయించారు. ఈ జిల్లాలో రెండు పులులు సంచారిస్తుండగా.. ఒకటి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లు అటవీ అధికారులు తెలిపారు. ఇక్కడ ఉన్న పులే లక్ష్మిపై దాడి చేసినట్లు అధికారులు గుర్తించారు. కాగా తాజాగా మంచిర్యాల జిల్లాల బెల్లంపల్లి మండలంలో శివారు అటవీ ప్రాంత గ్రామం చర్లపల్లిలో చిరుతపులి తిరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.

వెంటనే అక్కడి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు పాదముద్రల ఆధారంగా చిరుతపులి అని నిర్ధారించారు. దీంతో చుట్టు పక్కాల గ్రామాల వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు, చిరుత పులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహిళపై దాడి చేసిన పులి ఎక్కడి వెళ్లిందో అధికారులు చెక్ చేస్తున్నారు. డ్రోన్లు, మరోవైపు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎక్కడ కూడా పులి కదలికలు కెమెరాల్లో నిక్షిప్తం కాలేదు.
పులి ఆడదా, మగదా అని తెలియాలని.. అది తెలిస్తే పులి ప్రవర్తన ఏంటో అంచనా వేయ్యొచ్చని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. 10 ప్రత్యేక బృందాలు పులి ప్రభావిత గ్రామాల్లో గాలిస్తున్నాయి. పులి సంచారం ఉన్న గ్రామాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications