పోలీసులనే దబాయిస్తున్న షేక్: ఒమన్‌కే వస్తామంటూ డీసీపీ హెచ్చరిక
హైదరాబాద్ పాత నగరానికి చెందిన యువతిని ఒమన్‌కు చెందిన వృద్ధ షేక్ వివాహం చేసుకున్న ఘటన మరో మలుపు తిరిగింది.
హైదరాబాద్: పాత నగరానికి చెందిన యువతిని ఒమన్‌కు చెందిన వృద్ధ షేక్ వివాహం చేసుకున్న ఘటన మరో మలుపు తిరిగింది. 3నెలల క్రితం పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకొని ఒమన్‌లో చిత్రహింసలు అనుభవిస్తున్న 16ఏళ్ల రౌక్సర్) ఇంకా ఆ వృద్ధషేక్ చెరలోనే ఉంది. ఆమె ఫోన్‌లో వినిపించిన సంభాషణలు, ఆమె తల్లి ఫిర్యాదుతో ఫలక్‌నుమా పోలీసులు.. ఈ పెళ్లికి సహకరించిన బ్రోకర్ అహ్మద్‌పై ఇటీవల కేసు నమోదు చేశారు.
కాగా, రౌక్సర్‌ను పంపిచాలంటే తాను బ్రోకర్లకు ఇచ్చిన రూ.5 లక్షల నగదుతోపాటు ఖర్చులు తన ఖాతాలో వేయాలంటూ అహ్మద్ షరతులు విధించాడు. పైగా తాను ఇస్లాం మత పద్ధతుల్లోనే యువతిని వివాహం చేసుకున్నానని పోలీసులకు తేల్చి చెబుతున్నాడు. ఈ మేరకు పోలీసులకు ఓ వీడియోను పంపించాడు. దీంతో పోలీసులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు మాత్రం రౌక్సర్‌ను సురక్షితంగా పంపకపోతే తామే అక్కడికి వస్తామంటూ అతడిని హెచ్చరించారు.

వీడియో సాక్ష్యాలు పంపి...
రెండు రోజులు వేచి చూశాక అహ్మద్ నుంచి స్పందన రాని పక్షంలో ఒమన్‌కు ప్రత్యేక బృందాన్ని పంపుతామని సౌత్ జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. తాను రౌక్సర్‌ను ఆమె తండ్రి అఫ్సర్ అంగీకారంతో తాను సక్రమ పద్ధతుల్లోనే పెళ్లి చేసుకున్నానంటూ ఒమన్ షేక్ వీడియో సాక్ష్యాలను పంపించాడు. కాగా, ‘ఎలాగైనా రౌక్సర్‌తో వివాహం జరిపిస్తాం. మాకు రూ.5 లక్షలు ఇవ్వండి.. కట్నంగా ఒక స్కూటీ, ఇతర వస్తువులు మాత్రం అఫ్సర్‌కు ఇస్తేచాలు' అంటూ ఆ వీడియోలో బ్రోకర్లు గౌసియా బేగం, సికిందర్ చెప్పినట్లు ఉంది. అంతేగాక, రౌక్సర్‌ను పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయన్న భావనతో రౌక్సర్ వయస్సును 21 సంవత్సరాలుగా రాయించి తీసుకురావాలంటూ గౌసియాబేగంకు వివాహం జరిపించే ఖాజీ సూచించాడు.

చిత్రహింసలు పెడుతున్నారంటూ బాధితురాలు..
ఖాజీ సూచనను గౌసియాబేగం రౌక్సర్ తండ్రి అఫ్సర్‌కు తెలపగా.. రౌక్సర్ వయస్సు 21 సంవత్సరాలంటూ ధ్రువీకరణ పత్రం తెచ్చాడు. ఈ పత్రాన్ని ఒమన్ షేక్‌కు చూపించగా.. వారికి రూ.5లక్షలు ఇచ్చిన అనంతరం ఖాజీ ఇద్దరికీ పెళ్లి చేశాడు.
నాలుగురోజులు హైదరాబాద్‌లో ఉన్న అనంతరం అహ్మద్ రౌక్సర్‌కు పాస్‌పోర్టు తీయించి పెళ్లిఫోటోలను తన పాస్‌పోర్టుకు జతచేసి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు.
కాగా, అక్కడికి వెళ్లిన రౌక్సర్ అతడికి ముందే పెళ్లయ్యిందంటూ తెలుసుకుంది. తల్లిదండ్రులతో మాట్లాడతానంటూ అప్పుడప్పుడు అతడి ఎదురుగానే మాట్లాడేది. ఎవరూ లేని సమయంలో ఫోన్‌చేసి తనను చిత్రహింసలు పెడుతున్నారంటూ రోదిస్తూ తల్లికి వివరించింది.

షేక్‌ను షేకడించేందుకు..
ఈ నేపథ్యంలో సదరు ఒమన్ షేక్‌ను అరెస్ట్ చేసేందుకు ఫలక్‌నుమా పోలీసులు సాక్ష్యాలను సిద్ధం చేసుకున్నారు. రౌక్సర్ తండ్రి అఫ్సర్ వాంగ్మూలం సేకరించారు. భారత చట్టాల ప్రకారం బాల్యవివాహం నేరమని, మైనర్‌ను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటే భారత శిక్షాస్మృతి ప్రకారం శిక్ష అనుభవించాలంటూ అహ్మద్‌కు ఫోన్ చేసి చెప్పారు. విదేశీయులు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు తల్లిదండ్రులు అంగీకరించినా సరే అమ్మాయి యుక్త వయస్సు కాకపోతే పెళ్లి కూడా చెల్లదంటూ పేర్కొంటూ ఇందుకు సంబంధించిన పాతకేసుల వివరాలు, న్యాయస్థానాలు వెల్లడించిన తీర్పులను ఇందుకు సాక్ష్యాధారాలుగా సిద్ధం చేశారు.

ఒమన్ వెళ్లైనా..
ఒమన్‌కు నుంచి యువతిని తీసుకొచ్చాక మెజిస్ట్రేట్ సమక్షంలో రౌక్సర్ వాంగ్మూలాన్ని సేకరించిన అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అతడికి పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతోపాటు అతడిపై కేసు నమోదు చేసిన అనంతరం న్యాయస్థాయంలో బలమైన సాక్ష్యాధారాలుండేలా ఆమె తల్లిదండ్రులతో పాటు బ్రోకర్‌లను అప్రూవర్‌లుగా మార్చారు. ఇక షేక్ నుంచి ఎలాంటి జవాబు రాకుంటే ఒమన్‌కు వెళ్లి పోలీసులే.. రౌక్సర్‌ను, ఆ ఒమన్ షేక్‌ను తీసుకొచ్చే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications