షాదీ ముబారక్ కోసం భార్యకు మళ్లీ మళ్లీ బోగస్ పెళ్లి, రూ.8 లక్షలు స్వాహా
హైదరాబాద్: పహడీ షరీఫ్‌కు చెందిన అయిజుజుల్లా ఖాన్ అనే వ్యక్తి 'షాదీ ముబారక్' డబ్బుల కోసం తన భార్యకు మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేశాడు! పేదింటి యువతుల పెళ్లికి ఆర్థిక సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీ ముబారక్ పథకంలో అక్రమాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తన్నాయి.
కట్టుకున్న భార్యనే మరో వ్యక్తితో పెళ్లి జరిపించినట్లు నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు దండుకున్నాడు అయిజుజుల్లా ఖాన్. ఏకంగా 16 పెళ్లిళ్లకు సంబంధించిన నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ప్రభుత్వ సొమ్మును కాజేశాడు. ఈ ఘరానా మోసగాడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
బాలాపూర్‌కు చెందిన అయిజుజుల్లా ఖాన్ మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. అతనికి 2013లో లైఖా అనే యువతితో పెళ్లి జరిగింది. షాదీ ముబారక్ కింద ప్రభుత్వం అందించే రూ.51వేలు పొందాలంటే 2014 జూన్ 2వ తేదీ తర్వాత పెళ్లి చేసుకొని ఉండాలి.

దాంతో అతను నిఖా నామాలో తనకు 2014 జూన్ 2 తర్వాత పెళ్లైనట్లు తేదీలు మార్చి, పెండ్లి పత్రికలు అచ్చు వేయించి, ఫోటోలు దిగి, బ్యాంకు ఖాతా తెరిచాడు. రంగారెడ్డి మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ తాహెరుద్దీన్‌ను పరిచయం చేసుకున్నాడు.
రూ.51 వేలు భార్య పేర మంజూరు చేయించుకున్నాడు. ఇందుకోసం తాహెరుద్దీన్‌కు కొంత ముట్టచెప్పాడు. ఆ తర్వాత తన భార్యకు వేరే వ్యక్తితో బోగస్ పెళ్లి జరిపించాడు. ఆమె పేరిట బ్యాంకు ఖాతా తెరిచి, తాహెరుద్దన్ సహాయంతో మరో రూ.51వేలు పొందాడు.
వేరేవారికి సంబంధించిన ఆధార్ కార్డుల వివరాలు సేకరించి, నిఖానామాలో పేర్లు నమోదు చేయించి, నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి బ్యాంకు ఖాతాలు తెరిచి షాదీ ముబారక్ కు దరఖాస్తు చేసేవాడు. ఆ తర్వాత డబ్బులు తీసుకునేవాడు. ఇందులో తాహెరుద్దీన్‌కు కొంత వాటా ఇచ్చేవాడు.
ఇలా అయిజుజుల్లా ఖాన్ 16 బోగస్ పత్రాలు సృష్టించాడు. మొత్తం రూ.8 లక్షలకు పైగా స్వాగా చేశాడు. అతను సృష్టించిన బోగస్ ధ్రువపత్రాల్లోని ఇద్దరు అమ్మాయిలకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. తాహెరుద్దీన్‌ను పది రోజుల క్రితమే అరెస్టు చేశారు. తాజాగా అయిజుజుల్లా ఖాన్‌ను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications