ఏపీ విద్యార్థుల పిటిషన్లు కొట్టివేత: తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో అన్ని సీట్లు స్థానికులకే
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావం అనంతరం ఏర్పాటైన 34 మెడికల్ కాలేజీల్లోని సీట్లలో 85 శాతం కన్వీనర్(కాంపిటెంట్ అథారిటీ) కోటా సీట్లు రాష్ట్ర విద్యార్థులకే వర్తిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, అఖిల భారత కోటా 15 శాతంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకూ అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటైన కాలేజీల్లోని సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జులై 3న తీసుకొచ్చిన జీవో 72ను సమర్థించింది. జీవో 72ను సవాల్ చేస్తూ ఏపీ విద్యార్థులు దాఖలుచేసిన సుమారు 60పైగా పిటిషన్లు కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.

మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన 2017 నిబంధనలను సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది హైకోర్టు ధర్మాసనం. ఈ నిబంధనలను కేవలం పార్లమెంట్ మాత్రమే సవరించాలని.. శాసనసభకు ఆ అధికారం లేదనడం అపోహ మాత్రమేనని వ్యాఖ్యానించింది. సవరించిన నిబంధనల ప్రకారం 85 శాతం కాంపిటెంట్ అథారిటీ సీట్లను స్థానికులకు కేటాయించడం రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 5,6 పేరాల ప్రకారం విరుద్ధమేమీ కాదని స్పష్టం చేసింది.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం ఏపీ, తెలంగాణల్లో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ఉన్నత, సాంకేతిక విద్య, మెడికల్ విద్యా కోర్సుల్లో పదేళ్లపాటు ఇరు రాష్ట్రాలకు అవకాశం కల్పించాలని తెలిపింది. ఇది 2014, జూన్ 2 నాటికి ఉన్న అడ్మిషన్ల కోటా ప్రకారమేనని పేర్కొంది. 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన విద్యా సంస్థలకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేసింది.
తెలంగాణలో కాంపిటెంట్ కోటాలో రాష్ట్రావిర్భావానికి ముందున్న 20 కాలేజీల్లో.. 2,850 సీట్లుండగా.. ఆ తర్వాత ఏర్పడిన 34 కాలేజీల్లో 8,215 సీట్లు ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడిన 34 కాలేజీల్లో కాంపిటెంట్ కోటాలోని 85 శాతం సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కుతాయని.. జులై 3న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 72ను సవాల్ చేస్తూ 63 మంది ఏపీ విద్యార్థులు వేసిన పిటిషన్లపై.. సుదీర్ఘ వాదనల తర్వాత సీజే జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది. కాగా, హైకోర్టు తీర్పుపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications