ఏకమై ఏకేస్తున్న ప్రతిపక్షాలు: ఆత్మరక్షణలో కెసిఆర్?

హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆత్మరక్షణలో పడ్డారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. పరిణామాలు ఆయనకు వ్యతిరేకంగా చోటు చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ ఏకమై కెసిఆర్‌ను ఇరకాటంలో పడేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు కెసిఆర్ ప్రభుత్వంపై సమరం ప్రారంభించాయి. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని పట్టుబట్టి ప్రతిపక్షాల సభ్యులు శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు.

దీంతో ప్రతిపక్షాల నాయకులు రోడ్డెక్కి రాష్ట్రంలో పర్యటిస్తూ, ప్రజలను కదిలించే పనికి పూనుకున్నాయి. ప్రతిపక్షాల సభ్యులను సమావేశాలంతటికీ సస్పెండ్ చేసి ప్రభుత్వం పొరపాటు చేసిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఒక్క రోజుకో, రెండు రోజులకో సస్పెండ్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదనే మాట వినిపిస్తోంది. కాంగ్రెసు నాయకులు రైతు పరామర్శ యాత్ర చేపట్టగా, తెలుగుదేశం పార్టీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది.

8న బస్సు యాత్ర

ఈనెల 8వతేదీన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నేతల బస్సు యాత్ర జరగనుందని మాజీ మంత్రి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పరామర్శించనున్నారని తెలిపారు.

అలాగే రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాలన్నారు. అంతేగాక ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. 8న జరిగే బస్సు యాత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Opposition unite: KCR in self defence
కాంగ్రెసు పరామర్శ యాత్ర

కాంగ్రెస్ నేతల రైతు కుటుంబాల పరామర్శల యాత్ర ప్రారంభమైంది. శాసనసభ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా తొలుత మహబూబ్‌నగర్ జిల్లా నుంచి మంగళవారం పరామర్శ యాత్ర ప్రారంభించారు.

ఖిల్లా ఘనపురం మండలం కమాలుద్దీన్‌పూర్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప్రతిపక్ష నేత కుందూరు జానారెడ్డి, టి. పీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు డీ కె అరుణ, జి. చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, సంపత్ తదితరులతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

మజ్లీస్‌తో పొత్తు కోసమే..

టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య పొత్తు కోసమే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్లుగా ఉందని భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నేత కె. లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేందుకే ఆరునెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయే తప్ప సమస్యలకు పరిష్కారం మాత్రం లభించడం లేదరన్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఆదుకునేందుకు కేంద్రం సిద్దంగా ఉందని, అయినా ఆ దిశగా ప్రభుత్వం కృషిచేయడం లేదన్నారు.

9వ తేదీ డెడ్‌లైన్

రైతు రుణమాఫీపై ఈ నెల 9వతేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధిస్తున్నామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 9వతేదీ లోపు ఒకటేసారి రుణమాపీ చేస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయాలని, లేకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో నుంచి అడుగు కూడా బయటపెట్టలేరని ఆయన హెచ్చరించారు.

రుణమాఫీ మొత్తం ఒకటేసారి చేయడం వల్ల ప్రభుత్వానికి వస్తున్న ఇబ్బందులేమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఆ హామీని విస్మరించారన్నారు. రోజురోజుకూ రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

రైతులకు న్యాయం జరిగే వరకు ఐక్యంగా, ఏకతాటిపై పోరాటాలు చేస్తామని తెలుగుదేశం శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలన్నారు. విడతల వారీగా చేయడం వల్ల రైతుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈవిషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే రైతులకు చాలా చేశామని సీఎం చెబుతున్నారని, అసలు ఏం చేశారో చెప్పాలన్నారు. రైతుల కోసం ఓ మెట్టు దిగి కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాడుతున్నామని, కేసీఆర్ కు చేతకాకపోతే చెప్పాలని, కేంద్రం కాళ్లు పట్టుకోనైనా రైతు రుణ మాఫీ చేయిస్తామన్నారు.

కెసిఆర్ పట్టించుకోవడం లేదు...

ఓ వైపు రైతులు పిట్టల్లా రాలిపోతుంటే సీఎం కేసీఆర్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా నీరో చక్రవర్తిని తలపిస్తున్నాడని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని సీఎం కేసీఆర్ చెబుతుంటే ఆయన తనయుడు కేటీఆర్ మాత్రం దారిద్ర్యంలో ఉందంటున్నారని, ఈ విషయంలో వీరిద్దరి మధ్యే పొంతన లేదన్నారు.

అలాగే రైతుల బాధలు లేవనెత్తితే తమను ఆంధ్రా తొత్తులని అవహేళన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు సిద్దం కావాలన్నారు. అలాగే త్వరలో జరిగే వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక రెఫరెండమేనన్నారు.

కెసిఆర్ దొరతనం

అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రతిపక్షాలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ అన్నారు. మంగళవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంపై కేసీఆర్‌కు అవగాహనలేదని , ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. తమ బతకును బంగారుమయం చేస్తాడని ప్రజలు.. కేసీఆర్‌ చేతికి రాష్ట్రం అప్పగిస్తే రాంబదుల్లా దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఫీజులు కట్టలేక రైతుల బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. దొంగ ఎన్‌కౌంటర్లతో ఉద్యమాలు ఆగవని ప్రభుత్వాన్ని మధుయాష్కీ హెచ్చరించారు.`

సస్పెన్షన్ దారుణం..

శాసనసభలో విపక్షాలను సస్పెండ్ చేయడం దారుణమని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. విపక్షాలు లేని సభ పార్టీ సభగానే పరిగణించాల్సి వస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ నడుస్తున్నాడన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులతోనే అసెంబ్లీ ఎలా నడుపుతారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజావేదిక ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+