బతుకమ్మ పాటలో ఈ సారి కవిత స్పెషల్ - ముగ్గురు దిగ్గజాల చేతిలో : హుజూరాబాద్ బై పోల్ వేళ..!!
తెలంగాణ లో బతుకమ్మ సంబురాలు ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తారు. అందునా ముఖ్యమంత్రి కుమార్తె ప్రతీ ఏటా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తారు. కవిత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి సంస్థ తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఈ సారి అదే రకంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, తమ సంస్థ ద్వారా ఈ సారి బతుకమ్మ పాట కోసం ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. అందుకోసం ముగ్గురు దిగ్గజాలను రంగంలోకి దించారు. ఈ పాటకు ఈ సారి బతకుమ్మ సంబురాలతో పాటుగా రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.
గతం కంటే భిన్నంగా ఈ సారి బతుకమ్మ పాటను సిద్దం చేస్తున్నారు. ఇందు కోసం ఆస్కార్ అవార్డు విజేతను రంగంలోకి దింపారు. మరో ఇద్దరు ప్రముఖులు ఇందులో భాగస్వామ్యం తీసుకున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన బతుకమ్మ పాటకు ఉత్తర ఉన్నికృష్ణన్ స్వరాన్ని అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఈ పాట చిత్రీకరణ పూర్తి చేశారు. రచయిత మిట్టపల్లి సురేందర్ పాట రాసారు. అక్టోబర్ 5న ఈ పాటను అధికారికంగా విడుదల చేయనున్నారు.
దిగ్గజాలు కలిసి రూపొందించిన ఈ పాట అద్భుతంగా ఉన్నదని, దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు వ్యక్తంచేస్తున్నారు. ఇదే సమయంలో ఈ పాట బతుకమ్మ సంబురాలతో పాటుగా.. హుజూరాబాద్ బై పోల్ ప్రచార వేళ వస్తున్న పాట కావటంతో మరింత ట్రెండింగ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే హుజూరాబాద్ లో బైపోల్ నోటిఫికేషన్ తో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇక, ప్రధాన పార్టీలకు చెందిన ప్రముఖులు స్టార్ క్యాంపెయినర్లుగా రంగంలోకి దిగుతున్నారు.

ఈ సమయంలో దసరా పండుగ..బతుకమ్మ సంబురాల్లో మోత పుట్టించే ఈ పాట తెలంగాణ ఆడపడుచులను ఇట్టే కట్టిపడేస్తుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. దీని ద్వారా .. బైపోల్ ప్రచారంలోని ఈ పాట కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ పాటను కొంత మేర చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలోనూ జరిగినట్లుగా ప్రచారం సాగుతోంది. సాధారణంగా తెలంగాణ సాంప్రదాయంలో ఆట -పాటలకే ఉండే ప్రత్యేకత వేరు. అందునా మహిళల సంబురాలు- పాటలు అంటే మరింత ఆసక్తి కరంగా ఉంటాయి.
విడుదలకు ముందే ఈ పాట పైన పెద్ద ఎత్తున ఆసక్తి కనిపిస్తోంది. దీంతో..పాటు ముగ్గురు కీలక వ్యక్తులు కలిసి తీర్చి దిద్దిన పాట కావటంతో మరింత చర్చ సాగుతోంది. దీంతో..ఈ నెల 5న పాట ఆవిష్కరణ జరిగిన తరువాత ఈ పాట మీద స్పందన ఎలా ఉంటుందనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇటువంటి సెలబ్రెటీలతో ఈ పాట రూపొందించటమే ఈ సారి ఇంత ఆసక్తి పెరగటానికి కారణంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications