మహిళా శక్తి: కోటీశ్వరులను చేస్తామంటూ రేవంత్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరలను చేయడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్‌ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు.
గతంలో తాను తెలంగాణ హ్యాండ్లూమ్‌కి వీరాభిమానినని.. ప్రస్తుతం తెలంగాణ స్వయం ఉపాధి సంఘాలకు కూడా అభిమానినయ్యానంటూ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. భారతదేశమంటే గ్రామాలేనని.. గ్రామాల్లో మహిళల అభివృద్ధే సమగ్రాభివృద్ధి అని గవర్నర్ అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి స్టాళ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా మనల్ని అభినందించడానికి వచ్చిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సోలార్ పవర్ ప్రాజెక్టులలో అడబిడ్డలు అదానీ, అంబానీలతో పోటీ పడాలని ప్రభుత్వం నిర్దిష్ట కార్యక్రమంలో ముందుకు వెళుతోందన్నారు.
ఇది నెరవేరాలంటే స్వయం సహాయక సభ్యుల సంఖ్య 65 లక్షల నుంచి కోటి మందికి చేరాలి. కోటి మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత మాది.
ఆరు గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఈ ఏడాది ఆడబిడ్డల తరపున రూ.4వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించాం. ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకుని వారి సాధికారతకు మేం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. మీలో ఉన్న శక్తిని, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటడానికే హైటెక్ సిటీలో స్టాల్స్ ఏర్పాటు చేసామని సీఎం రేవంత్ వివరించారు.
మహిళా శక్తిని గొప్పగా చాటే బాధ్యత మీపై ఉంది. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం.
లక్ష మంది మహిళలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ అందరినీ అక్కడికి ఆహ్వానిస్తున్నాం. మీ కరతాల ధ్వణుల మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవిష్కరించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications