భూ కబ్జా.. మాజీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేపై హైడ్రాలో ఫిర్యాదు
ప్రతి సోమవారం హైదరాబాద్ నగరంలోని ప్రజల నుంచి అక్రమ నిర్మాణాలు, కబ్జాలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాలో ఫిర్యాదు నమోదైంది. అమీన్‌పూర్‌లో 193 సర్వే నెంబర్‌లోని తమ భూమి కబ్జాకు గురైందని ఓ మహిళ హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
పాన్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి, చిస్ట్లా రమేశ్ అనే వ్యక్తి కలిసి తమ భూమిని కబ్జా చేశారని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారన్నారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పించినట్లు ఆమె చెప్పారు. తన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

పాన్యం మాజీ ఎమ్మెల్యే రాంగోపాల్ రెడ్డి, రమేశ్ కలిసి అమీన్‌పూర్‌లో 193 సర్వే నెంబర్‌లోని తన భూమిని కబ్జా చేశారని బాధితురాలు తెలిపారు. చెరువు ఔట్ ఫ్లో వెళ్లకుండా మొత్తం మట్టి పోసి ఎత్తు పెంచారు. దీంతో రైతులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. చాలా లేఔట్లు, వ్యవసాయ భూములు మునిగిపోయాయని ఆమె తెలిపారు.
అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, గూగుల్ పిక్చర్స్, ఎఫ్ఐఆర్ కాపీలు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు అందజేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
కాగా, హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లోని హైడ్రా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈరోజు ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని అధికారులను హైడ్రా కమిషనర్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.












Click it and Unblock the Notifications