పడిపోయిన హైదరాబాద్ స్థానం: ఆక్స్‌ఫర్డ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు!
గ్లోబల్ సిటీగా శరవేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగర జీవన నాణ్యతపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. 'ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ 2026' నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1,000 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ 421వ స్థానానికి పడిపోయింది. దేశంలోని మహానగరాలైన ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైలతో పోలిస్తే హైదరాబాద్ వెనుకబడిపోవడం గమనార్హం. ఆర్థిక పురోగతి, హ్యూమన్ క్యాపిటల్ విభాగాల్లో అగ్రగామిగా నిలిచినప్పటికీ.. జీవన ప్రమాణాలు, పర్యావరణ విభాగాల్లో పేలవమైన ప్రదర్శన కనబరిచింది.
జీవన నాణ్యతలో 818వ స్థానం ఆర్థిక దృఢత్వంలో 248వ స్థానం, హ్యూమన్ క్యాపిటల్ విభాగంలో 241వ స్థానంతో హైదరాబాద్ ప్రతిభ చాటింది. బలమైన ఉపాధి అవకాశాలు, ఐటీ కాస్మాపాలిటన్ సంస్కృతి, విశ్వవిద్యాలయాలు, నైపుణ్యమున్న యువత హైదరాబాద్ ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. అయితే ఈ పురోగతి స్థానిక నివాసితుల ప్రాథమిక జీవన ప్రమాణాలను మెరుగుపరడడంలో విఫలమైంది. ఆదాయ అసమానతలు, విపరీతంగా పెరిగిన ఇళ్ల అద్దెలు, వైద్య సదుపాయాలు, నేరాల రేటు, వినోద రంగాలు ప్రాతిపదికగా లెక్కించిన 'క్వాలిటీ ఆఫ్ లైఫ్' విభాగంలో హైదరాబాద్ ఏకంగా 818వ స్థానానికి దిగజారింది.

మరోవైపు పర్యావరణ విభాగంలో హైదరాబాద్ 657వ స్థానంలో నిలిచింది. ముంబై(782), ఢిల్లీ(915) కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ.. బెంగళూరు(528) కంటే వెనుకబడే ఉంది. గాలి కాలుష్యం పెరగడం, కార్బన్ ఉద్గారాలు, వాతావరణంలో సంభవిస్తున్న ఆకస్మిక మార్పులు, అస్తవ్యస్తంగా మారుతున్న ట్రాఫిక్ వ్యవస్థ నగర వాసులకు శాపంగా మారుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
కేవలం ఆర్థికంగా ఎదగడమే కాకుండా.. పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని నగర ప్లానర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, రోడ్ల పరిస్థితిని సీరియస్‌గా తీసుకోవడం, ప్రజా రవాణాను బలోపేతం చేసి సొంత వాహనాల వాడకాన్ని తగ్గించడం ద్వారా మాత్రమే కాలుష్యాన్ని అదుపు చేసి 'క్వాలిటీ ఆఫ్ లైఫ్' ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ఆర్థిక పురోగతిని, ఆరోగ్యకరమైన జీవన నాణ్యతతో సమతుల్యం చేసుకోవడమే హైదరాబాద్ ముందున్న ప్రధాన లక్ష్యం













Click it and Unblock the Notifications
