'పాకాల సరస్సు' అందాలు ఎంత వర్ణించినా తక్కువే.. ఎలా వెళ్లాలి..?
బిజీ బిజీ లైఫ్ కు బోర్ కొట్టిందా..? అలా వీకెండ్ లో ఎక్కడికైనా వెళ్లి రావాలని అనిపిస్తుందా..? అయితే మీకు బెస్ట్ ఆప్షన్ పాకాల సరస్సు.. హైదరాబాద్ కు దగ్గరలోనే ఉండే ఈ సరస్సు ముఖ్యంగా వర్షాకాలంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సీజన్ లో పర్యాటకుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం మధ్య ప్రకృతి అందాలలో సేదతీరాలి అనుకునేవారికి ఈ ప్రాంతం సరైన ఎంపిక అని చెప్పొచ్చు. పాకాల చెరువు ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
పాకాల సరస్సు ఉమ్మడి వరంగల్ జిల్లా సర్వం పేటలోని ఖానాపురం మండలంలో ఉంది. దీనిని అందరూ పాకాల చెరువు అని పిలుస్తుంటారు. చెరువు చుట్టూ ఉండే ఎత్తయిన గుట్టలు, చిలకల గట్లు అక్కడి ప్రకృతి రమణీయతను పెంచుతున్నాయి. అలాగే తెలంగాణ పర్యాటకశాఖ ఈ చెరువును ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది. ఇక్కడి బయోడైవర్సిటీ పార్కు, బోటు షికారు, నైట్ క్యాంపింగ్, ట్రెక్కింగ్, నేచర్ వాక్ తదితర సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే పాకాల కట్ట దిగువన చిల్డ్రెన్ పార్క్, బటర్ ఫ్లై గార్డెన్ ఆకర్షిస్తోంది. ఇక్కడే సైకిల్ సవారీని సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ప్రత్యేకంగా ఫొటో షూట్ కూడా ఉంది.

పాకాల సరస్సు చరిత్ర చూస్తే ఈ సరస్సును కాకతీయ రాజులు నిర్మించారు. ఈ చెరువును రెండో ప్రతాపరుద్రుడి ముని మనవడు అయిన మూడో గణపతి దేవ చక్రవర్తి 1213 లో తవ్వించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఈ చెరువుకు 3,200 ఘనపుటడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉందని అధికారులు వివరిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరం నుంచి ఈ పాకాల చెరువు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి రైళ్లలో వచ్చే పర్యాటకులు వరంగల్ లో దిగాలి. అక్కడి నుంచి బస్సు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి 58 కిలోమీటర్ల దూరంలో పాకాల చెరువు ఉంటుంది.












Click it and Unblock the Notifications