హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్థానీ.. నేపాల్ మీదుగా సిటీలోకి
హైదరాబాద్ పోలీసులు ఓ పాకిస్థాన్ జాతీయుడ్ని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సిటికి చెందిన యువతిని వివాహం చేసుకున్న ఈ పాకిస్థానీ.. ఆమెను కలుసుకునేందుకు నేపాల్ మీదుగా హైదరాబాద్ వచ్చాడు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న మహమ్మద్ ఫయాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహమ్మద్ ఫయాజ్ దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయకులను కాల్చి చంపిన నేపథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. దేశంలోని పాకిస్థాన్ పౌరులను వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్థానీయుల అన్ని వీసాలను రద్దు చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పాకిస్థానీయులను గుర్తించే పనిలో పడ్డాయి.

తెలంగాణలోని పాకిస్థాన్ పౌరులకు హెచ్చరిక
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థానీయులు భారత్ విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని పాకిస్థాన్ జాతీయులను ఆయా ప్రభుత్వాలు గుర్తించి పంపించి వేస్తున్నాయి. తాజాగా, తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలకు ఉపక్రమించింది.
తెలంగాణలో ఉన్న పాకిస్థానీయులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. తెలంగాణలో ఉన్న పాకిస్థాన్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. పాకిస్థానీయులకు వీసాలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసిందని.. ఇప్పటికే వీసాలు పొందినవారికి ఏప్రిల్ 27 వరకు గడువు ఉందని చెప్పారు. మెడికల్ వీసాలపై వచ్చినవారికి ఏప్రిల్ 29 వరకు అనుమతి ఉందన్నారు.
ఏప్రిల్ 30 వరకే వాఘా సరిహద్దు తెరిచి ఉంటుందన్నారు. అప్పట్లోపు హైదరాబాద్ తోపాటు తెలంగాణలో ఉన్న పాకిస్థాన్ పౌరులు వాగా సరిహద్దు దాటాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. పాకిస్థానీలపై నిఘా కొనసాగుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్క పాకిస్థానీలు ఉన్నారో ట్రాకింగ్ చేస్తున్నామని తెలిపారు.
కాగా, రాష్ట్రాల్లోని పాకిస్థానీయులను గుర్తించి వెంటనే వారిని పాకిస్థాన్‌కు పంపాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా, హైదరాబాద్ నగరంలో 208 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు సమాచారం. వీరందరిని రెండు రోజుల్లోగా పాక్ వెళ్లిపోవాలని డీజీపీ ఆదేశించారు. ఇటీవల పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన విషయం విధితమే. ఈ ఉగ్రదాడులు పాక్ ప్రేరేపితమైన తేలడంతో భారత్ తీవ్రంగా స్పందించింది.












Click it and Unblock the Notifications