Paradise Hotel: నీరు వృథా చేసిన ప్యారడైజ్ హోటల్.. రూ. 20వేల జరిమానా
రాష్ట్రంలో ఎల్ నినో, వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయి. జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులు తీవ్రమైన నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు. నగర వాసులకు దాహార్తిని తీర్చే సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం అంతకంతకూ పడిపోతోంది. ఇక ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా సాగునీటి కంటే తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేస్తోంది. ఈ క్రమంలో నగరంలో నీటిని వృథా చేసిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్యారడైజ్ హోటల్ కు జలమండలి తాజాగా రూ.20 వేల జరిమానా విధించింది. హోటల్ లో జలమండలి అధికారుల తనిఖీలు నిర్వహించి తాగునీరు వృథా అవుతున్నట్లు గుర్తించారు. దీంతో రూ.20 వేల జరిమానా విధించారు. అలాగే నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని హోటల్ సిబ్బందిని ఆదేశించారు.
ఇక ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్ కు అధికారులు రూ.20 వేల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అంతేకాక పబ్ కు నీటి కనెక్షన్ ను కూడా తొలగించారు. తాగునీటిని వృథా చేసినందుకు ఈ చర్యలు చేపట్టారు అధికారులు. మరోవైపు హైదరాబాద్ కు కీలకమైన జంట జలాశయాల నుంచి రోజుకు దాదాపు 10 లక్షల లీటర్లకు పైగా తాగునీరు వృథాగా పోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. లీకేజీల వల్ల రోజుకు నాలుగైదు వేల ఇళ్లకు పైగా సరిపడా నీరు వృథా అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రతి చుక్కనూ పొదుపుగా వాడాలని, నీటి వృథాను అరికట్టాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇక రాష్ట్రంలో అక్టోబర్ 28 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్షపు నీటిని ఒడిసి పట్టి కాపాడుకోవాలి నిపుణులు సూచిస్తున్నారు. వర్షం కురిసే సమయంలో ఇళ్లపై నుంచి వర్షపు నీరు పడుతుంది. దానిని భూమిలోకి ఇంకేలా గుంతలు ఏర్పాటు చేయాలని.. అలాగే ఇంట్లో వాడిన నీటిని కూడా ఆ గుంతలోకి వెళ్లేలా చూడాలని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలోని 333 మండలాల్లో తీవ్రమైన లోటు కొనసాగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలో 13 జిల్లాల్లో అత్యంత దుర్భిక్షమైన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ క్రమంలో ఎల్ నినో పరిస్థితుల నుంచి బయట పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది.












Click it and Unblock the Notifications
