'మనం లేకపోతేనే అమ్మాయి కాపురం బాగుంటుంది'.. ఆ తల్లిదండ్రులు సంచలన నిర్ణయం.. చివరికి..
తల్లిదండ్రులు ఎప్పుడూ తమ పిల్లల భవిష్యత్తు కోసమే ఆలోచిస్తారు. వాళ్లు సరైన మార్గంలో నడిచి ఉన్నత స్థానాల్లో ఉండాలని అందుకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తుంటారు. అలాగే పిల్లల కోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతుంటారు. అయితే తమ కుమార్తె భవిష్యత్తు కోసం ఆ తల్లిదండ్రులు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్న ఆ కుమార్తె కోసం ఏకంగా తనువు చాలించేందుకు సిద్ధమయ్యారు. తాము లేకపోతే కుమార్తె కాపురం బాగుంటుందని.. భర్తతో కలిసి ఆమె సుఖంగా ఉంటుందని భావించి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది..?
తల్లిదండ్రులకు పిల్లలు ఎప్పుడూ భారం కారు.. కానీ కొందరు పిల్లలకు మాత్రం ఆ తల్లిదండ్రులు భారంగా భావిస్తుంటారు. అయితే సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటన వింటే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లాల్సిందే. ఇదే గ్రామానికి చెందిన సత్యనారాయణ, గోవిందమ్మ దంపతులకు రేణుక అనే ఒక కుమార్తె ఉంది. అయితే రేణుక వివాహం తర్వాత తన భర్తతో కలిసి బెంగళూరులో ఉండేది. అయితే తన తల్లిదండ్రులు వృద్ధులు కావడం కారణంగా వారిని చూసుకుంటానని చెప్పి రేణుకు భర్తను వదిలి స్వగ్రామానికి వచ్చింది. అలా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.
ఈ క్రమంలో రేణుక ఆమె భర్త మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అయితే తమ కారణంగానే కుమార్తె కాపురం చెడిపోతోందని.. వారి మధ్య గొడవలకు కారణం అవుతోందని ఆ వృద్ధ దంపతులు భావించారు. ఈ మేరకు భర్త దగ్గరకు వెళ్లాలని కుమార్తెకు సూచించారు. అందుకు రేణుక అంగీకరించలేదు. దాంతో తమ కుమార్తె కాపురంలో వస్తున్న ఇబ్బందులు చూడలేక ఆ తల్లిదండ్రులు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తాము చనిపోతే.. కుమార్తె, అల్లుడు జీవితాంతం సుఖంగా ఉంటారని భావించారు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకునేందుకు ఇంటిని వదిలి వెళ్లిపోయారు. అలా విఠలాపూర్ నుంచి బాసర చేరుకున్నారు. అక్కడే ఓ లాడ్జిలో రూమ్ అద్దెకు తీసుకున్నారు. బ్యాగులో పురుగు మందు డబ్బా పెట్టుకున్నారు.

అయితే ఇదే సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేరని గుర్తించిన కుమార్తె రేణుక వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి ఫోన్ లొకేషన్ ఆధారంగా వాళ్లు బాసర చేరుకున్నట్లు గుర్తించారు. వెంటనే వాళ్లు ఉన్న గదికి వెళ్లి పురుగు మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వారిని కుమార్తె రేణుకకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications
