పవన్ కళ్యాణ్ చొరవతోనే కొండగట్టుకు మహర్దశ..కేంద్రమంత్రి హర్షం!
కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించి శుభవార్తను చెప్పిన విషయం తెలిసిందే. అయితే కొండగట్టు ఆలయ అభివృద్ధికి టిటిడి నిధులు కేటాయించడం వెనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. కొండగట్టు ఆలయంలో 2000 మంది భక్తులు దీక్ష విరమణ చేపట్టేలా మండపం నిర్మించడంతో పాటు, 96 గదులతో సత్రం నిర్మించేందుకు 35.19 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు టీటీడీ రెండు రోజుల క్రితం ఆమోదం తెలిపింది.
కొండగట్టు ఆలయ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ హామీ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సు తోనే కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించింది. ఇక ఇదే విషయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరజీవి జలధార కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు. తెలంగాణలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి నాకు పునర్జన్మ ఇచ్చారు. దర్శనానికి వెళ్తే పూజారులు భక్తుల సౌకర్యార్ధం మండపం నిర్మించేందుకు సహకరించాలని కోరారన్నారు. నేను చేస్తానని హామీ ఇచ్చానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ చొరవపై బండి సంజయ్ హర్షం
ఇచ్చిన హామీ మేరకు టీటీడీకి సిఫార్సు చేసి అభివృద్ధికి నిధులు ఇప్పించగలిగానని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆలయ అభివృద్ధి పైన చేసిన ఈ వ్యాఖ్యలను జనసేన పార్టీ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఇదిలా ఉంటే కొండగట్టు ఆలయ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ చూపించిన ప్రత్యేక చొరవ పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు.
వంద కొట్లిస్తామని, చిల్లిగవ్వ ఇవ్వని గత బీఆర్ఎస్ ప్రభుత్వం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల కోసం 96 గదుల సత్రం నిర్మించడానికి టిటిడి ద్వారా 35.19 కోట్లు కేటాయించడం హర్షణీయమని బండి సంజయ్ పేర్కొన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం కొండగట్టు ఆలయానికి 100 కోట్ల రూపాయలు ఇస్తామని, నయా పైసా ఇవ్వకుండా మోసం చేసింది అన్నారు.
కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే చెయ్యాల్సింది ఇదే
కాంగ్రెస్ ప్రభుత్వం కొండగట్టుకు చిల్లిగవ్వ ఇవ్వకపోగా, ఆర్జిత సేవల చార్జీల పెంపు పేరుతో భక్తుల పైన భారం మోపిందని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు భక్తులకు కనీస సౌకర్యాలు లేకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. దేవాలయాల పైన ప్రేమ ఒలకబోస్తూ ఉన్న కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కొండగట్టు ఆలయానికి నిధులు కేటాయించి, అన్ని విధాల అభివృద్ధి చేయాలని బండి సంజయ్ హితవు పలికారు.












Click it and Unblock the Notifications