బాబుకు మ్యాంగో ఫ్రెండ్: రేవంత్ కేసులో న్యాయనిర్ణేతగా పవన్ కళ్యాణ్!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన మ్యాంగో ప్రేమ కనబరుస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చెందిన దినపత్రిక నమస్తే తెలంగాణ వ్యాఖ్యానించింది.
ఎవరు తప్పుచేసినా ప్రశ్నించేందుకు తానుంటానని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఆ సంగతే విస్మరించారని, గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి అనుకూలంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రచారం చేసిన అతను, తప్పుచేస్తే ఎవరినైనా ప్రశ్నిస్తానని ప్రగల్బాలు పలికారని పేర్కొంది.

కానీ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తీరును తెలుగు ప్రజలు తప్పుబడుతున్నా పవన్ కల్యాణ్ మౌనంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైందని, చంద్రబాబుకు తన ఫామ్‌హౌస్‌లో పండిన పండ్లు పంపారని రాసింది.
'చంద్రబాబు గారు... మీకు శుభాకాంక్షలు. తియ్యటి మామిడి పండ్లతో ఈ వేసవి మరింత గుర్తుండుపోయేలా గడవాలని కోరుకుంటూ.. పవన్ కళ్యాణ్' అని సొంత లేఖ కూడా దానికి జత చేశారని రాసింది. కాగా, పవన్ ప్రశ్నించక పోవడం పైన కాంగ్రెస్ నేత వి హనుమంత రావు, దర్శకుడు రాంగోపాల్ వర్మ తదితరులు కూడా నిలదీసిన విషయం తెలిసిందే.
కాగా, ఓటుకు నోటు కేసులో న్యాయనిర్ణేతగా పవన్ కళ్యాణ్‌ను పెట్టాలని వీహెచ్ డిమాండ్ చేయడం గమనార్హం. ఏపీ సీఎం చేసింది తప్పో ఒప్పో పవన్ కళ్యాణ్ చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications