మీ ఇష్టం!!: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఊరించి ఉసూరుమనిపించిన పవన్ కళ్యాణ్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మద్దతు పైన బుధవారం స్పందించారు. ఈ నెల 5వ తేదీన ఎవరికి మద్దతిస్తారో జనసేనాని వెల్లడిస్తారని ఇటీవల జనసేన ప్రకటించింది. జనసేన చెప్పినట్లుగా పవన్ ఈ రోజు తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ ఎన్నికలపై స్పందించారు.
ఏ పార్టీకి మద్దతిస్తారోననే ఉత్కంఠ అందరిలోను నెలకొంది. తెరాసకు ఆయన మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరికి మద్దతిస్తున్నారో స్పష్టంగా చెప్పలేదు. ఓ మంచి నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకే సూచించడం గమార్హం. ఎవరికి మద్దతిస్తారో ఎల్లుండి చెబుతామని చెప్పి, తీరా ఎవరికీ మద్దతివ్వకుండా.. కేవలం మంచి వారిని ఎన్నుకోమని పవన్ చెప్పడంపై సెటైర్లు వస్తున్నాయి. పవన్ ఊరించి ఉసూరుమనిపించారు.

దాశరథి చెప్పిన మాటలతో..
అందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ధనం దాచగలరేమో గానీ తేజస్సును దాచలేరని, శిరస్సును వంచలేరని, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి చెప్పిన మాటలు తన మదిలో మార్మోగుతున్నాయని చెప్పారు. తెలంగాణ సమరయోధుల స్ఫూర్తిని, స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ యువత ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందని చెప్పారు.

అందుకే తెలంగాణ అంటే ఇష్టం
ఎన్నో ఒడిదుడుకుల మధ్య సరికొత్త రాష్ట్రాన్ని సాధించుకున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తిని, త్యాగాలను తాను సంపూర్ణంగా గుర్తించానని, అర్థం చేసుకున్నానని చెప్పారు. అందుకే తెలంగాణ అంటే చాలా గౌరవమని చెప్పారు. ఈ రోజు ముందస్తు ఎన్నికలు రావడం వల్ల, తక్కువ సమయం ఉండటం వల్ల, తాను ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల తెలంగాణలో జనసేన పోటీ చేయలేకపోయిందని చెప్పారు.

అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు
ఇప్పుడు మన ముందు ఉన్నది.. తెలంగాణ ఇచ్చామనేవాళ్లు, తెలంగాణను తెచ్చామనేవాళ్లు, తెలంగాణ ఇచ్చేలా చేశామనే వాళ్లు ఉన్నారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వీళ్లందరి మధ్య ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదనే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారని జనసైనికులను ఉద్దేశించి చెప్పారు.
లోతుగా ఆలోచించి నిర్ణయం
ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో తన విన్నపం ఒక్కటేనని, నేను ఆలోచిస్తోంది ఒకటేనని, మనకు అత్యంత ఎక్కువ పారదర్శకతతో, తక్కువ అవినీతితో ఎవరైతే మంచి పరిపాలన అందించగలరో.. దీనిపై అందరూ లోతుగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని, తద్వారా తెలంగాణకు బలమైన ప్రభుత్వాన్ని మనం అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు. చివరలో జై తెలంగాణ అన్నారు.












Click it and Unblock the Notifications