Pawan Kalyan: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దిగుతున్న పవన్ కళ్యాణ్, షెడ్యూల్ ఇదే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. జనసేన, బీజేపీ అభ్యర్థుల తరుఫున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. బుధవారం వరంగల్, నవంబర్ 25న తాండూరు, 26న కూకట్పల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. కాగా, ఈ ప్రచారంలో పవన్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఎలాంటి విమర్శలు చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
బుధవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నవంబర్ 25న తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్‌కు మద్దతుగా ప్రచారంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్.. 26న కూకట్ పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

ఆ తర్వాత తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) పాల్గొనే బహిరంగ సభల్లోనూ అధికారికంగా పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభల్లో కూడా పవన్ మాట్లాడనున్నారు. ఇంతకుముందు కూడా మోడీ హాజరైన సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల్లో బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్న జనసేన తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకి మద్దతు ఇచ్చింది.
ఈ క్రమంలో ఇరుపార్టీల తరపున అగ్ర నాయకులు తమ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. జనసేన తరుఫున పవన్ ఇప్పటివరకు ఎలాంటి ప్రచారంలోను అధికారకంగా పాల్గొనలేదు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రచారం చేయనుండంతో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. తన ప్రసంగాల్లో విరివిగా తెలంగాణ ఉద్యమాన్ని, నేతల పోరాటాన్ని ప్రస్తావించే పవన్ కళ్యాణ్.. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఎలాంటి విమర్శలు ఎక్కుపెడతారు? తమ అభ్యర్థుల గెలుపు కోసం పవన్ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారనేది ఉత్కంఠగా మారింది. తమ పార్టీ అభ్యర్థులకు పవన్ ప్రచారం సానుకూలంగా మారతాయని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications