పక్కా స్కెచ్! ఎలాంటి ఆధారాల్లేకుండా.. ఎస్బీఐ బ్యాంకులో 3.10 కోట్ల చోరీ, సవాల్ అంటూ సీపీ
పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులు బుధవారం అర్ధరాత్రి దాటిన తరవ్ాత భారీ చోరీ జరిగింది. నగదు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మొత్తం రూ. 3.10 కోట్లు విలువైన సొత్తును అపహహరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పక్కా ప్లాన్‌తో బ్యాంకు చోరీ..
దొంగలు బ్యాంకుకు వెనుక వైపు ఉన్న కిటికీలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. అలారం మోగకుండా ఉండేందుకు ముందుగానే బ్యాటరీ కనెక్షన్ తీసేవారు. ఆ తర్వాత వెంట తెచ్చుకున్న గ్యాస్ కట్టర్‌తో లాకర్ బద్దలు కొట్టి, అందులోని రూ. 18.46 లక్షల నగదుతోపాటు రూ. 2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించారు.
అంతేగాక, చోరీకి సంబంధించిన దృశ్యాలు రికార్డైన సీసీ ఫుటేజీ డీవీఆర్ బాక్స్‌ను కూడా దొంగలు వెంట తీసుకెళ్లడం గమనార్హం. ఈ ఘటనపై బ్యాంక్ మేనేజర్ పాలరాజు ఫిర్యాదుతో మంథని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ చోరీ సవాలేనంటూ సీపీ
ఘటనా స్థలాన్ని రామగుండం సీపీ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వేలిముద్రలు కూడా దొరకకుండా దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకుని దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ఈ కేసును సవాలుగా తీసుకున్నట్లు చెప్పారు. నిందితుల కోసం మొత్తం 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

సీఐ ఇంట్లో చోరీ..
ఇది ఇలావుండగా, సంగారెడ్డి జిల్లాలో ఓ సీఐ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా సీసీఎస్ సీఐగా పనిచేస్తున్న నాగేశ్వరరావు కుటుంబం సంగారెడ్డిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. ఇంట్లో రెండు గదులు ఉండగా.. ఒక గదికి తాళం వేసి మరో గదిలో కుటుంబసభ్యులు నిద్రకు ఉపక్రమించారు. కొందరు దుండగులు మంగళవారం రాత్రి గదికి వేసిన తాళలు పగలగొట్టి 10 తులాల బంగారం, రూ. 60వేల నగదును అపహరించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ బాలాజీ, పట్టణ సీఐ, ఎస్ఐలు, క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. కాగా, నాగేశ్వరరావు గతంలో సంగారెడ్డి పట్టణ సీఐగా పనిచేశారు. సీఐ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.