తెలంగాణ 'తలసరి' అదుర్స్: కేంద్రం వద్ద అదే మైనస్ అయింది!!
హైదరాబాద్: తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉండటం మైనస్ అయిందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఎక్కువగా ఉండటం సంతోషకరమే అయినప్పటికీ, కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదలకు అది కారణమయిందని ప్రభుత్వం వాపోతోంది.
రాష్ట్రాల ప్రగతి సూచికల్లో ఒకటైన తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోని పలు రాష్ట్రాలను అధిగమించింది. జాతీయ సగటు కన్నా మంచి స్థితిలో ఉంది. సమాచారం అందుబాటులో లేని మరికొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే.. 21 రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. తెలంగాణ ఐదో స్థానంలో ఉంది.
రాష్ట్రాల 2014-15 తలసరి ఆదాయాలను నీతి ఆయోగ్ విశ్లేషించింది. తలసరి ఎక్కువగా ఉండటంతో అది రాష్ట్ర ప్రగతిని తెలియజెపుతుంది. అయితే, అదే కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదలకు కారణమై మైనస్ అయిందని వాపోతున్నారు.

ఈ కారణంగానే వాటాలను లెక్కగట్టేటప్పుడు తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని తెలంగాణ రాష్ట్రం 14వ ఆర్థిక సంఘం వద్ద విఫలయత్నం చేసింది. తలసరి ఎక్కువగా ఉండటం తెలంగాణకు కేంద్ర పన్నుల్లో తక్కువ వాటా రావటానికి కారణమైంది.
కేంద్ర పన్నుల రాబడిలో 42 శాతాన్ని అన్ని రాష్ట్రాలకు ఇస్తూ తిరిగి అందులో ఏ రాష్ట్రానికి ఎంతేసి వాటాను ఇచ్చేది నిర్ధారించేందుకు 14వ ఆర్థిక సంఘం కొన్ని ప్రామాణికాలను లెక్కలోకి తీసుకొని వాటికి ప్రాధాన్యాలను ఇచ్చింది.
దీనిలో తలసరి ఆదాయానికి ఏకంగా 50 శాతం ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో తెలంగాణ వాటా తక్కువగా కేవలం 2.437 శాతంగా నిర్ధారణ అయింది. తలసరిలో ఆఖరి స్థానంలో ఉన్న బిహార్‌కు 9.665 శాతం వాటా లభించింది. రూ.40 వేలు కలిగి జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా యూపీకి 17.959 శాతం వాటా వచ్చింది.అందువల్లనే ఈ ఏడాది కేంద్ర పన్నుల్లో వాటాల రూపేణా తెలంగాణకు రూ.12,823 కోట్లు లభించనున్నాయి.












Click it and Unblock the Notifications