కవిత సంచలన కామెంట్స్.. దుర్మార్గులు నా భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు
తెలంగాణలో గత బీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) పాలనలో జరిగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టిన తర్వాత మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈసారి సాక్షాత్తూ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత నుంచే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.ప్రస్తుతం 'జనం బాట' కార్యక్రమం ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కవిత, క్షేత్రస్థాయి సమస్యలను ప్రస్తావిస్తూనే, గత ప్రభుత్వంలో తనకెదురైన అనుభవాలను బయటపెట్టారు.
రాజకీయాల్లో తనకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఒక తెలంగాణ ఆడబిడ్డగా తన గౌరవానికి భంగం కలగడంతోనే తాను మొహమాటం లేకుండా ఇప్పుడు నిజాలు బయటపెడుతున్నానని కవిత పేర్కొన్నారు. ఆమె మాటల్లోని భావోద్వేగం, నాటి ప్రభుత్వంలో తనకు ఎదురైన ఇబ్బందులను స్పష్టంగా తెలియజేస్తోంది.

ఈ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తన భర్త ఫోన్ సంభాషణలను కూడా దొంగచాటుగా విన్నారని (ట్యాపింగ్ చేశారని) కవిత ఆరోపించారు.తన భర్త ఫోన్‌ను ఎవరు ట్యాపింగ్ చేశారనే విషయంపై కవిత స్పష్టంగా పేరు చెప్పకుండా దాటవేశారు. కానీ నాటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తి ఇదంతా చేశాడని పరోక్షంగా వ్యాఖ్యానించడం తెలంగాణ రాజకీయాలలో వేడిని పెంచింది.
ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఫోన్ ట్యాపింగ్ వెనుక కేటీఆర్ హస్తం ఉందని మొదటి నుంచీ ఆరోపిస్తోంది. గతంలో కేటీఆర్ కూడా తమ అధికారంలో ఉన్నప్పుడు 'ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండవచ్చని' పేర్కొన్నారు.
అయితే, కాంగ్రెస్ ఆరోపణలు రాజకీయ అవసరం కావచ్చు, కానీ సొంత సోదరి తన భర్తకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పడం.. నాటి ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలు,అధికార పోరాటాన్ని బట్టబయలు చేస్తోంది. కవిత వ్యాఖ్యలు ఇప్పుడు విచారణను ఏ దిశగా మలుపు తిప్పుతాయో చూడాలి.












Click it and Unblock the Notifications