కయ్యం: ఎపిపిఎస్సీకి టీ స్టాఫ్ తాళం (పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్) కార్యాలయానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిపిపిఎస్‌సి) ఉద్యోగులు గురువారంనాడు తాళం వేశారు. ఈ రెండు కమిషన్ల మధ్య కయ్యం రాజుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఆంధ్ర అధికారులు తమపై గిల్లికజ్జాలకు దిగుతున్నారంటూ వారు విమర్శిస్తున్నారు.
రెండు రాష్ర్టాలుగా విడిపోయిన తర్వాత కూడా తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ఆంధ్రా అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగుల విభజన జరిగి నెల గడిచినప్పటికీ, అందుకు సంబంధించిన ఫైళ్లు, రికార్డులు, ఫర్నీచర్, భవనాల విభజన జరుగకుండా కావాలనే కయ్యానికి కాలుదువ్వుతున్నారని టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల సంఘం మండిపడింది.
తమ ఫైళ్లు, రికార్డులను అప్పగించాలని అడిగీ అడిగీ విసిగిపోయిన తెలంగాణ ఉద్యోగులు గురువారం ఏపీపీఎస్సీ పరిపాలనా భవనంలో ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఎపిపిఎస్‌సి ఆఫీసుకు తాళం వేశారు.

గదికి తాళం
ఫైళ్లు ఇచ్చేందుకు ఆంధ్రా అధికారులు ససేమిరా అనడంతో ఏపీపీఎస్సీ పరిపాలన గదికి తాళం వేసి, అక్కడే బైఠాయించారు.

ఇలా ఆందోళన
ఆందోళనలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ సంఘాల నేతలు గోపాల్‌రెడ్డి, రవీకుమార్, సుశీల, లక్ష్మీ శంకర్, శ్రీదేవి, శశికళ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల జోక్యం
పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసుల జోక్యంచేసుకొని చక్కదిద్దారు. దాంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గురువారం ఉదయం నుంచే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

నచ్చజెప్పారు...
రెండు రాష్ర్టాల సర్వీస్ కమిషన్ కార్యదర్శులు ప్రత్యేకంగా సమావేశమై శుక్రవారం నుంచి విభజన పనులు ప్రారంభిద్దామని సిబ్బందికి నచ్చజెప్పటంతో తాత్కాలికంగా ఆందోళన విరమించినట్లు టీఎస్పీఎస్సీ ఉద్యోగుల సంఘం నాయకులు ఆంజనేయులు, పవన్‌కుమార్‌గౌడ్ తెలిపారు.

విమర్శలు..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అన్ని ఉమ్మడి సంస్థలను సామరస్యపూర్వకంగా విభజించుకోవాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, ఆంధ్రా పాలకులు మాత్రం అడుగడుగునా అడ్డుతగులుతున్నారని తెలంగాణ ఉద్యోగులు విమర్శిస్తున్నారు.

ఫైళ్లు, రికార్డులు ఇవ్వడం లేదు
రికార్డులు, ఫైళ్లు లేకపోవడంతో టీఎస్పీఎస్సీలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంవల్ల సాంకేతిక సమస్యలు తలెత్తే ప్రమాదముందని తెలంగాణ అధికారులంటున్నారు.

ఆమెతోనే సమస్య
విభజనకు ఏపీపీఎస్సీ చైర్మన్ సానుకూలంగానే ఉన్నప్పటికీ, ఇన్‌చార్జి కార్యదర్శి డీ రమాదేవి అడ్డుపడుతున్నారనే ఆరోపణలు చేస్తున్నారు.

చంద్రబాబు పేరు..
తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయని కార్యదర్శి చెప్తున్నట్లు సీనియర్ ఉద్యోగులు అంటున్నారు.












Click it and Unblock the Notifications