పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుకు చేదు అనుభవం (వీడియో)
ఖమ్మం: పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రేగా కాంతారావు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. మణుగూరు మండల కేంద్రం కాళీమాత సెంటర్ వద్ద అభ్యర్థి రేగా కాంతారావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, ఆయన రాకను స్థానిక కాలనీవాసులు అడ్డుకున్నారు. గత నాలుగేళ్ల నుంచి ఎలాంటి అభివృద్ధి చేయకుండా కాలయాపన చేసి మరోసారి ఓట్లు ఎలా అడుగుతారని ఎమ్మెల్యేని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. వినకపోవడంతో అక్కడ్నుంచి వెనుదిరిగారు. పలు ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురవుతుండటం గమనార్హం. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఇంటింటిక ప్రచారం చేస్తున్న క్రమంలో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొవాల్సి వస్తోంది.

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీలో తమ పార్టీదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చెబుతూనే మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తోమో చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో భారీ బహిరంగసభలు నిర్వహిస్తూ మరోసారి అవకాశమివ్వాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత, ఇతర నేతలు కూడా ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా అదే స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.
పినపాక బీఆర్ఎస్ అభ్యర్థి రేగ కాంతారావును అడ్డుకున్న ప్రజలు..!#RegaKanthaRao #BRSParty #TelanganaElection2023 #TelanganaElections2023 #Telangana #Oneindiatelugu pic.twitter.com/9keFxFiopU
— oneindiatelugu (@oneindiatelugu) November 23, 2023
బీజేపీ జాతీయ నాయకులతోపాటు రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, ఇతర నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ జాతీయ నేతలతోపాటు రాష్ట్ర నేతలు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications