నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం హైదరాబాద్‍కు రానున్నారు. నగరంలోని గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బీ) ద్విదశాబ్ది వార్షికోత్సవాన్ని గురువారం జరుపుకుంటోంది. ఈ వార్షికోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు.

ప్రత్యేక విమానంలో బేగంపేటకు ప్రధాని మోడీ
ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం 1:25 గం.లకు మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరకుంటారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు రాష్ట్ర అధికారులు, బీజేపీ నాయకులు ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విమానాశ్రయం ముందు ఏర్పాటు చేసిన వేదిక వద్ధకు చేరుకుంటారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రధానికి ఘన స్వాగతం పలికి సన్మానించనుంది.

ఐఎస్‌బీ ద్వితీయ వార్షికోత్సవానికి ప్రధాని మోడీ
ప్రధాని మోడీ రాక నేపథ్యంలో బేగంపేట విమానాశ్రయాన్ని ఎస్పీజీ భద్రతా దళాలు తన అధీనంలోకి తీసుకుంది. భద్రతలో పాల్గొనే సిబ్బందికి అధికారులు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా హెచ్‌సీయూకి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఐఎస్‌బీకి వెళ్తారు. ఐఎస్బీ ద్వితీయ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. కాగా, అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా రోడ్డు మార్గాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఐఎస్‌బీ వరకు పీఎంవో భద్రతా విభాగం బుధవారమే ట్రయల్ రన్ నిర్వహించింది.ప్రధాని పర్యటన సందర్భంగా పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు.

బెంగళూరుకు కేసీఆర్.. దేవెగౌడ, కుమారస్వామిలతో భేటీ
ఇది ఇలావుండగా, ప్రధాని మోడీ పర్యటనకు తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి దూరంగా ఉండనున్నారు. గురువారం ఆయన బెంగళూరు వెళ్లనున్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడతో పాటు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీఆర్ సమావేశం కానున్నారు. గురువారం ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. దేవెగౌడ నివాసంలో లంచ్ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

దేశ రాజకీయాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై కేసీఆర్ చర్చ
దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో చర్చిస్తారు కేసీఆర్. దేశంలో
కొత్త రాజకీయ కూటమి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న కేసీఆర్.. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి పలువురు నేతలను కలిసిన విషయం తెలిసిందే. తాజా భేటీలో త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో బెంగళూరులో అభిమానులు ఇప్పటికే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటు ముఖ్యమంత్రి భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. కేసీఆర్ గురువారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ రానున్నారు.

వరుసగా మూడోసారి ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్... మరోసారి ప్రధాని మోడీ పర్యటనకు దూరంగా ఉండనున్నారు. గురువారం మోడీ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లో జరిగే సమావేశానికి హాజరవుతున్నారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ బెంగళూరులో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడం ఇది మూడోసారి. 2020 నవంబరు 28న ప్రధాని హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను సందర్శించారు. అప్పుడు కూడా వెళ్లలేదు.
గత ఫిబ్రవరి 5న ప్రధాని హైదరాబాద్‌కు వచ్చారు. ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణ, ఇక్రిశాట్‌లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటికి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. జ్వరం కారణంగా వాటిలో పాల్గొనలేదని కేసీఆర్ తెలిపారు. ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండటంపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.