ప్రధాని మోడీ రాక: హైదరాబాద్ సిటీలో ఈ రూట్లలో వెళ్లొద్దు, ట్రాఫిక్ మళ్లింపులు ఇలా
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జోరుగా ప్రచారాన్ని చేస్తున్నాయి. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు శనివారం పర్యటించనున్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.
పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ శనివారం సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు చేరుకోనున్నారు. ఆ తర్వాత 5.40 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో ప్రధాని మోడీ కీలక ప్రకటన చేస్తారని నేతలు భావిస్తున్నారు. సభ అనంతరం తిరిగి సాయంత్రం 6 గంటల తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమవుతారు ప్రధాని మోడీ.

కాగా, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన దృష్ట్యా శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా పోలీసులు, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు, శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉండనున్నాయి. పంజాగుట్ట-గ్రీన్ ల్యాండ్స్-బేగంపేట నుంచి సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వైపు వెళ్లేవారు ఆ రూట్‌లో వెళ్లొద్దని సిటీ పోలీసులు ప్రజలకు సూచించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం రైళ్లలో, జూబ్లీహిల్స్ బస్ స్టేషన్ మీదుగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలనుకునే సాధారణ ప్రయాణికులు సకాలంలో రైల్వే స్టేషన్ కు చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలని, వీలైతే మెట్రో రైలులో ప్రయాణించాలని సూచించారు.
ట్రాఫింక్ మళ్లింపులు:
-సంగీత ఎక్స్ రోడ్-వైఎంసీఏ-ప్యాట్నీ-ప్యారడైజ్-సీటీవో-రసూల్ పురా-బేగంపేట-బాలమ్రాయ్-బ్రూక్ బాండ్-టివోలి-స్వీకార్ ఉపకార్-వైఎంసీఏ-సెయింట్ జాన్స్ రోటరీ
-బోయిన్‌పల్లి-తాడ్‌బండ్-రాణిగంజ్-ట్యాంక్‌బండ్-కార్ఖానా-జేబీఎస్-ఎస్బీహెచ్
- ఆర్టీఏ తిరుమలగిరి-కార్ఖానా-మల్కాజిగిరి-సఫిల్‌గూడ.
-జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్-పంజాగుట్ట-ఖైరతాబాద్-గ్రీన్ ల్యాండ్స్-రాజ్‌భవన్.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో నవంబర్ 10తో నామినేషన్ ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications