స్మార్ట్ ఫోన్ తో వేలకు వేలు సంపాదించవచ్చా?
మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంట్లో కూర్చునే గంటకు వేలల్లో సంపాదించవచ్చు అని నిరుద్యోగులను గృహిణులను టెంప్ట్ చేస్తూ అనేక ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే నిజంగానే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రోజు వేలల్లో సంపాదించవచ్చా? అసలు దీనిపైన తెలంగాణ పోలీసులు ఏమంటున్నారు.. అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ ఉంటే వేలల్లో సంపాదనపై పోలీసులు ఏమన్నారంటే
తెలంగాణ పోలీసులు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు గంటల్లో వేల రూపాయలు సంపాదించవచ్చు అని జరుగుతున్న ప్రచారంపైన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా తాజాగా ఆసక్తికర పోస్ట్ చేశారు. సైబర్ మోసాల పైన నిత్యం అవగాహన కల్పిస్తున్న తెలంగాణ పోలీసులు ఈ తరహా ప్రకటనలను నమ్మకూడదని ప్రకటన చేశారు. ఇంట్లోనే ఉంటూ గంటకు వేల రూపాయలు సంపాదించే అవకాశం అని చేస్తున్న ప్రకటనలు మోసపూరిత ప్రకటనలు అని పేర్కొన్నారు.

దోపిడీ చేసే ముఠాలు జాగ్రత్త
వారిని నమ్మి ఎటువంటి డిపాజిట్లు చేయకూడదని హెచ్చరించారు. ఇక స్మార్ట్ ఫోన్లో రేటింగ్ ఇస్తే చాలు డబ్బులు వస్తాయి అని చెప్పేది పూర్తిగా అబద్ధమని స్మార్ట్ గా మీ ఖాతా ఖాళి చేసే ప్లాన్ అది అని పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోం అంటూనే చాలా తెలివిగా ప్లాన్ చేసి దోపిడీ చేసే ముఠాలు ఉన్నాయని పేర్కొన్నారు.
సర్వం దోచే కుట్ర
మొదట మీకు డబ్బులు ఇచ్చినట్టే చేసి ఎర వేసి ఆ తర్వాత మిమ్మల్ని సర్వం దోచే కుట్ర చేస్తున్నారని తెలిపారు. సైబర్ మోసాల పైన అవగాహన అవసరమని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్మార్ట్ ఫోన్ తో డబ్బులు సంపాదించవచ్చు అని వెళితే స్మార్ట్ గా మీ ఖాతాను ఖాళీ చేస్తారని హెచ్చరించారు. ఇక సోషల్ మీడియాలో కనిపించే ప్రకటనలు చూసి మోసపోవద్దని తెలంగాణ పోలీసులు.
సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా మోసం
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న సైబర్ నేరాల విషయంలో నిత్యం ప్రజలను అలెర్ట్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ళ మాయలో ఇంకా సామాన్యుల నుండి సెలబ్రిటీల దాకా మోసపోతూనే ఉన్నారు. అందుకే పదే పదే ఈ విషయాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు.












Click it and Unblock the Notifications