బీఆర్ఎస్ లో కీలక అరెస్ట్..!!
Konatham Dileep arrest: ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి నాయకుడు, సోషల్ మీడియా ఇన్ ఛార్జ్, తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్ అరెస్ట్ అయ్యారు. అమెరికా నుంచి వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తన తండ్రి బక్కారెడ్డి జ్ఞాపకాల పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి కిందటి నెల 18వ తేదీన అమెరికా వెళ్లారు కొణతం దిలీప్. వర్జీనియాలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

అనంతరం ఆయనను నిర్మల్ కు తరలించారు. నిర్మల్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఇదివరకు ఎఫ్ఐఆర్ (నంబర్ 353) నమోదైంది. ఈ కేసు విషయంలోనే ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొణతం దిలీప్ మీద తెలంగాణలో వేర్వేరు పోలీస్ స్టేషన్లల్లో పలు కేసులు నమోదయ్యాయి.
గత సంవత్సరం దిలీప్ పై లుక్ అవుట్ సర్క్యులర్ సైతం జారీ అయింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హాజరు కావడానికి నెల రోజుల పాటు అమెరికా వెళ్లడానికి కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. స్వదేశానికి తిరిగివచ్చిన వెంటనే ఆయన అరెస్ట్ అయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తోన్నందుకే కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తన వైఫల్యాలను ప్రశ్నించినందుకు రేవంత్ ప్రభుత్వం అరెస్టులతో వేధింపులకు పాల్పడుతోందంటూ విమర్శిస్తోంది.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే కొణతం దిలీప్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడటం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం న్యాయస్థానాలను అవమానించడమేనని చెప్పారు.
ప్రజా పాలన అని చెప్పుకోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోన్నదని ఆరోపించారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications