పోలీసు ఉద్యోగాలకు పరీక్ష తేదీలు ఖరారు.. పూర్తి వివరాలు ఇవే..
తెలంగాణ పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి నిర్వహించనున్న రాత పరీక్షల తేదీలు తాజాగా ఖరారు అయ్యాయి. ఎస్ ఐ స్థాయి పోస్టులకు నవంబర్ 29న అలాగే కానిస్టేబుల్ స్థాయి పోస్టులకు డిసెంబర్ 20న రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు కొద్దిసేపటి క్రితం వెల్లడించారు. ఈ రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది జులై 29న హోంశాఖ పరిధిలోని పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF), అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో దాదాపు 7,437 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. పరీక్షలు జరుగుతాయా..? లేదా..? అనే అనుమానంలో ప్రస్తుతం ప్రిపరేషన్ లో ఉన్న అభ్యర్థులకు ఈ వార్త కాస్త ఉపశమనాన్ని కలిగించింది.
ఇక జూలై లో పోలీస్ శాఖ విడుదల చేసిన 7,437 పోస్టుల్లో దాదాపు 4,800 కానిస్టేబుల్ పోస్టులు, 200 ఎస్ ఐ పోస్టులు ఉన్నాయి. అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో 44 ఎస్ ఐ, 1,380 కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇక అగ్నిమాపక శాఖలో 39 ఎస్సై, 751 కానిస్టేబుల్ పోస్టులు ఉండగా.. జైళ్ల శాఖలో 15 ఎస్ ఐ, 208 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ పరీక్షలకు దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 19 న ప్రారంభమైంది. అలా సెప్టెంబర్ 16 వరకు అంటే 28 రోజులపాటు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. 4.29 లక్షల మంది నుంచి మొత్తం 5.77 లక్షల దరఖాస్తులు అందాయి.

పోలీస్ పరీక్ష కోసం సగటున ఒక్కో అభ్యర్థి 1.34 దరఖాస్తులు చేసినట్లు TSLPRB చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. మొత్తం దరఖాస్తుదారుల్లో 68.45 శాతం మంది ఒకే పోస్టుకు, 28.88 శాతం మంది రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఇక నవంబర్ 29న జరిగే ఎస్ ఐ ప్రాథమిక రాత పరీక్షను ఉమ్మడి 10 జిల్లాల కేంద్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అలాగే డిసెంబర్ 20న జరిగే కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 15 నుంచి 18 ప్రాంతాల్లో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష తేదీలను విడుదల చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
