ఇకపై ఉదయం 9 నుంచి రాత్రి 9 లోపు మాత్రమే ఆ పనికి పర్మిషన్..
హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో, ముఖ్యంగా మాదాపూర్ జోన్‌లోని స్పా సెంటర్లకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ప్రజల భద్రత, మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) నివారణ సహా పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని కఠిన నిబంధనలను అమలులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు మాదాపూర్ జోన్‌లోని స్పా కేంద్రాల యజమానులతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (ఏహెచ్‌టీయూ), లా అండ్ ఆర్డర్ విభాగం, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్ఓటీ) అధికారులు కలిసి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ వినీత్, మహిళా శిశు భద్రతా విభాగం డీసీపీ సృజన, ఎస్ఓటీ డీసీపీ శోభన్ తదితర అధికారులు, స్పా యజమానులు హాజరయ్యారు.
ఈ మేరకు చట్టాన్ని ఉల్లంఘించే స్పా కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. స్పా సెంటర్ల నిర్వాహకులకు పోలీసులు పలు కీలక సూచనలు చేశారు. స్పా కేంద్రాల్లో లైంగిక కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. అటువంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. అంతే కాకుండా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల లోపు మాత్రమే స్పా కేంద్రాలు నిర్వహించుకోవాలని తెలిపారు.

నివాస ప్రాంతాల్లో స్పా సెంటర్లను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. అలానే పని చేసే ఉద్యోగులకు కూడా ఫిజియోథెరపీ, అక్యుప్రెషర్ వంటి వాటిలో తగిన అర్హతలు ఉండాలని స్పష్టం చేశారు. ఉద్యోగుల పూర్తి వివరాలతో కూడిన రిజిస్టర్‌ను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. పనిచేసే ఉద్యోగుల వయస్సు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలని వివరించారు.
పోలీసులు ముఖ్యమైన ఆదేశాలు..
కస్టమర్ల పేర్లు, అడ్రస్, సంప్రదింపు వివరాలను పొందుపరిచే రిజిస్టర్‌ను కూడా తప్పనిసరిగా నిర్వహించాలి.
పని సమయాల్లో స్పా కేంద్రాల ప్రవేశ ద్వారం ఎల్లప్పుడూ తెరిచే ఉండాలి.
లైసెన్స్ నంబర్, సెంటర్ పేరు, అందించే సేవల ఫీజుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలి.
ప్రవేశద్వారం వద్ద, రిసెప్షన్, కామన్ ఏరియాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్పా యజమానులకు సూచించారు.












Click it and Unblock the Notifications