Alert: నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు విసిరేసిన యూట్యూబర్ అరెస్ట్ (వీడియో)
హైదరాబాద్: రద్దీగా ఉన్న రహదారులపై డబ్బులు చల్లుతూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు సృష్టించిన యూట్యూబర్ హర్షను పోలీసులు తాజాగా, అరెస్ట్ చేశారు. నడిరోడ్డుపై డబ్బులు వెదజల్లడంతో ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు ఇప్పటికే హర్షపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పోలీసులు యూట్యూబర్స్, రీల్స్ చేసేవారికి హెచ్చరికలు చేశారు. రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు. రద్దీ ప్రాంతాల్లో న్యూసెన్స్ చేస్తే చర్యలు తప్పవు. దుశ్చర్యలకు పాల్పడితే కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

అసలేం జరిగిందంటే ?
మోతీనగర్ పరిధి పర్వత్‌నగర్‌కు చెందిన వంశీ పవర్(హర్ష) ఓ యూట్యూబర్. ఇన్‌స్టాగ్రాంలో అకౌంట్ తెరిచి తరచూ పలు అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ఇటీవల పలుచోట్ల డబ్బులు దాచిపెడుతూ ముందుగా వచ్చి నగదు తీసుకుని లబ్ధి పొందాలని ఫాలోవర్స్‌కు సూచనలు చేస్తూ లైవ్ వీడియోలు చేశాడు. అంతటితో ఆగకుండా రద్దీగా ఉన్నా పలుచోట్లు జనంలోకి వెళ్లి ఒక్కసారిగా నోట్లను విసిరేయడం, ఆ వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేయడం చేశాడు.
జూన్‌లో కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో డబ్బులను గాల్లోకి విసిరేశాడు. వాటిని ఏరుకోవడానికి జనం గుమిగూడటం వంటి దృశ్యాలను తీసి తన ఇన్‌స్టా ఖాతాలో అప్లోడ్ చేశాడు. నగదును ఏరుకోవడానికి జనాలు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. అసలే బిజీ రోడ్డు కావడం, రోడ్డుపై ఉన్న వారంతా కరెన్సీ నోట్ల కోసం అడ్డదిడ్డంగా పరుగెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సుమారు 50వేల రూపాయల విలువైన వంద నోట్లను వంశీ పవర్ గాల్లోకి విసిరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో దీనికి వ్యూస్ వచ్చాయి.
A Influencer in Hyderabad flew money in crowd road and make reel to gain subscriber and viewership #Reels pic.twitter.com/6UtM2NHfWd
— Stock Trader's Bridge (@bridge_stock) August 22, 2024
అయితే, ఆ యూట్యూబర్ తీరుపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అతడు చేసిన పనికి రద్దీ రోడ్లపై గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, అటువంటి అనాలోచిత పనులు మానుకోవాలని కామెంట్లు చేశారు. పోలీసులు పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి వీడియోలు తీయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ వీడియోలు వైరల్‌గా మారడంతో నిందితుడిపై కూకట్‌పల్లి పోలీసులు 'న్యూసెన్స్' కేసు నమోదు చేశారు. తాజాగా, శుక్రారం అతడ్ని అరెస్ట్ చేశారు. ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications