ఓ పక్క పొలిటికల్ గురువు..! మరో పక్క సినిమా దేవుడు..! ఇద్దరిని కాదనుకున్న గణేషుడు..!
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు ఊపందుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న ఆ పార్టీకి ఈ చేరికలు నైతిక స్తైర్యాన్ని అందిస్తున్నాయి. ప్రముఖ సిని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరి తాను అత్యంత సన్నిహితంగా ఉండే రెండు పార్టీలకు షాక్ ఇచ్చారు. ఆ రెండు పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే గణేష్ ఎందుకు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. వైసీపి సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు శిష్యుడుగా, జనసైన అదినేత పవన్ కళ్యాణ్ కు అనుచరుడుగా ముద్రవేసుకున్న గణేష్ ఆ ఇద్దరిని కాదని ఎందుకు కాంగ్రెస్ గూటికి చేరారనేదే ఉంత్కంఠ రేపుతోంది.

కాంగ్రెస్ లో చేరికల జోరు..! అవుతుందా కారు బేజారు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. తెలంగాణలో ముందస్తు హడావిడి రోజురోజుకూ పెరిగిపోతుంది. ఏపీలో సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ అక్కడి పార్టీలు కూడా తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకుంటూ అప్రమత్తంగా ఉంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా పైఎత్తులు వేస్తోంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఇతర పార్టీలతో పొత్తుల అంశంతో పావులుకదుపుతోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన కసరత్తులు చేస్తూనే, మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది.

టీఆర్ఎస్ లో అసంత్రుప్తి సెగలు..! వారినే క్యాచ్ చేయాలనుకుంటున్న కాంగ్రెస్..!!
టీఆర్ఎస్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీపై చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కన్ను ఆ నేతలపై పడింది. ఇప్పటికే పలువురు నేతలతో టీకాంగ్రెస్ నేతలు మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని భావించింది. ఈ ప్రయత్నాల్లోనే ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు అక్కడి నేతలు. కాంగ్రెస్ అంటే ఇష్టమున్న గణేష్, రాహుల్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నాడు.

అటు వైసీసి.. ఇటు జనసేన.. రెండూ తనకు ఆరాథ్యమే..! కాని చేరింది మాత్రం కాంగ్రెస్ లో..!
పార్టీలో చేరిన తర్వాత పవన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గణేశ్. జనసేన అధినేత తనకు తండ్రి లాంటి వాడని, కానీ కాంగ్రెస్ అంటే మొదటి నుంచీ ఇష్టమని చెప్పాడు. వాస్తవానికి మెగా ఫ్యామిలీ అంటే పడి చచ్చే బండ్ల గణేష్, పవన్ తరపున వాకాల్తా పుచ్చుకుని మరీ మాట్లాడుతుంటాడు. గతంలో పవన్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన గణేష్, ఆ మధ్య పవన్‌తో రెండు సినిమాలను కూడా నిర్మించాడు. కొద్దిరోజుల కిందట ఓ చానెల్‌లో వచ్చిన డిబెట్‌లో పవన్‌ను విమర్శించిందని వైసీపీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు.

కాంగ్రెస్ నుండి షాద్ నగర్ బరిలోకి బండ్ల..! తెలంగాణ ప్రజల ఆదరణ ఉంటుందా..!
అంతేకాదు, మాజీ మంత్రి, ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా ఉన్న బొత్సా సత్యనారాయణతో కూడా బండ్ల గణేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో గణేష్ ఈ రెండు పార్టీల్లో ఒకదానిలో చేరుతాడని గతంలో బాగా ప్రచారం జరిగింది. గణేష్ ఏపీకి చెందిన వాడు కాకపోయినప్పటికీ ఆయనకు ఏదో ఒక ఎంపీ సీటు ఇవ్వాలని ఈ రెండు పార్టీలు భావించినట్లు, అందుకోసం గణేష్‌తో మంతనాలు కూడా జరిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, అనూహ్యంగా గణేష్ ఈ రెండు పార్టీలకు షాకిస్తూ కాంగ్రెస్ గూటికి చేరిపోయాడు. బండ్ల గణేష్ వచ్చే ఎన్నికల్లో షాద్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నాడని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications