పాలిటెక్నిక్ ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో విడుదల
పాలిటెక్నిక్ కాలేజీల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ కాలేజీలను కార్మిక శాఖ (శక్తి విభాగం) పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ మేరకు తాజాగా జీవో 97ను సవరిస్తూ జీవో 157ను విడుదల చేసింది. పాలిటెక్నిక్ కళాశాలలు విద్యాశాఖలోనే కొనసాగుతాయని జీవోలో స్పష్టం చేసింది.
కాగా ఐటీఐలు, ఏటీఐలు మాత్రం కార్మిక శాఖ పరిధిలోకి వెళ్లాయి. ఇక విద్యాశాఖ పరిధిలోకి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది. స్కిల్ యూనివర్సిటీ ఏఐసీటీఈ అనుమతి పొందాలని ఉత్తర్వులు జారీచేసింది. కార్మికశాఖ పరిధిలోకి ఐటీఐలు, ఏటీఐలు తీసుకొస్తున్నట్లు వివరించింది.
అయితే శక్తి స్కీం పేరుతో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ విలీన ప్రక్రియతో పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ లో చేరే లేటరల్ ఎంట్రీ విధానానికి స్వస్తి పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పాత విధానంలో కొనసాగించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు తొలుత ఇచ్చిన జీవో నెంబర్ 97ను సవరిస్తూ జీవో 157ను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.












Click it and Unblock the Notifications
