ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు
పాకిస్తాన్ కు వెళ్లాలంటే ఎలా పాస్ పోర్టు తీసుకోవాలో నియోజకవర్గాల్లో పర్యటనకు వెళుతున్నప్పుడు కూడా అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదని, కానీ వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ కేటాయించారన్నారు.
తనకిచ్చిన వాగ్దానాన్ని పార్టీ నాయకత్వం నెరవేర్చలేదని, పోడు భూముల విషయంలో ఇచ్చిన హామీని కేసీఆర్ అమలు చేయలేదన్నారు. BRS ఆహ్వానం మేరకే ఆ పార్టీలో చేరానని, తనతోపాటు తనవారికి కూడా పదవులు ఇప్పించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా మెజారిటీ స్థానాల్లో భారత రాష్ట్ర సమితిని గెలిపించానని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో అందరికీ మంచి జరుగుతుందని, అందరికీ మంచిరోజులు వస్తాయని వ్యాఖ్యానించారు.

భారత రాష్ట్ర సమితి నాయకత్వంపై పొంగులేటి కొద్దిరోజులుగా విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీని వీడేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. జనవరి ఒకటో తేదీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా తన అనుచరులు, అభిమానులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఆయా సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈనెల 18వ తేదీన అమిత్ షాతో భేటీ అవుతారంటూ వార్తలు వచ్చినప్పటికీ పొంగులేటి భేటీ కాలేదు. ఈ ప్రచారం సాగుతున్న సమయంలోనే సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతోపాటు కొందరు కాంగ్రెస్ నేతలు పొంగులేటికి ఆహ్వానం పంపించారని తెలుస్తోంది. పొంగులేటి వ్యాఖ్యల తర్వాత అతనికి సెక్యూరిటీని కూడా ప్రభుత్వం తగ్గించింది. ఇప్పుడు తనకున్న సెక్యూరిటీని తొలగించినా ఏ ఇబ్బంది లేదన్నారు.