చిరంజీవిని పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు కే వాసు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కే వాసు కన్నుమూశారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని ఆయన నివాసంలో శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయనకు నగరంలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు నెలలుగా ఆయనకు డయాలసిస్ కూడా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం కే వాసు కన్నుమూశారని ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కే వాసు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సతాపం తెలిపారు. ఆయనకు తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మొదటి సినిమా ప్రాణం ఖరీదుకు కే వాసు దర్శకత్వం వహించడం గమనార్హం. ఈ చిత్రం ద్వారానే చిరంజీవిని వెండి తెరకు పరిచయం చేశారు కే వాసు. కే వాసు తండ్రి ప్రత్యగాత్మ, ఆయన సోదరుడు హేమంబరధరరావు కూడా దర్శకులే. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో మంచి సినిమాలను రూపొందించారు. వారి బాటలోనే నడిచిన కే వాసు కూడా ఎన్నో అనేక చక్కని చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు.
1951, జనవరి 15న కే వాసు జన్మించారు. 22 ఏళ్ల పిన్నవయసులోనే దర్శకత్వం వహించి అప్పట్లో సంచలనం సృష్టించారు. చిరంజీవి మొదటి సినిమా పునాదిరాళ్లు అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం కే వాసు దర్శకత్వం వహించిన ప్రాణం ఖరీదు. ఈ చిరంజీవి తోపాటు వాసుకు కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చిరుతో పలు హిట్ సినిమాలు రూపొందించారు.
ప్రాణం ఖరీదు, కోతల రాయుడు, తోడు దొంగలు, అల్లుళ్లొస్తున్నారు, పల్లెటూరి పెళ్లాం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన భక్తి చిత్రం 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్మ్యం'.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ చిత్రంలోని పాటలు ఇప్పటికీ అలరిస్తున్నాయి. ఇక చివరగా వాసు దర్శకత్వం వహించిన చిత్రం గజిబిజి.












Click it and Unblock the Notifications