ఒక్క ఓటు విలువ ఎంత? తెలంగాణలో జరిగిన ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది!
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నమోదైన ఓ అద్భుతమైన సంఘటన ఓటు శక్తిని మరోసారి ప్రపంచానికి చాటింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికల ఫలితం కేవలం ఒక్క ఓటు తేడాతో తేలింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. విజయం సాధించిన మహిళా అభ్యర్థి ముత్యాల శ్రీవేదకు ఓటు వేయడానికి ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేకంగా అమెరికా నుంచి తమ స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ ఒక్క ఓటునే ప్రజలు తమ కోడలికి ఆయన అందించిన 'ఆశీర్వాద వరం'గా అభివర్ణిస్తున్నారు.
ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి తన కోడలు శ్రీవేద సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలుసుకుని, నాలుగు రోజుల ముందే అమెరికా నుంచి బయలుదేరి నిర్మల్ జిల్లాకు చేరుకున్నారు. గ్రామంలో మొత్తం 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోల్ అయ్యాయి. ఓట్ల లెక్కింపులో శ్రీవేదకు 189 ఓట్లు లభించగా.. ఆమె ప్రత్యర్థి హర్షస్వతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లనిదిగా ప్రకటించారు. దీంతో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో శ్రీవేద సర్పంచ్‌గా గెలుపొందారు. ఈ నిర్ణయాత్మకమైన ఒక్క ఓటు ఇంద్రకరణ్ రెడ్డిదే కావడంతో, ఆయన ప్రయాణం, ఓటు ప్రాముఖ్యత ఈ గ్రామంలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

గతంలో ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి కూడా బాగాపూర్ సర్పంచ్‌గా పనిచేశారు. 2013లో ఆయన మేనకోడలు కూడా సర్పంచ్‌గా గెలుపొందారు. ఇప్పుడు ఆయన కోడలు విజయం సాధించడం ఆ కుటుంబ రాజకీయ చరిత్రలో ఒక విశేషంగా నిలిచింది. ఓటు వేయడానికి అమెరికా నుంచి భారీ ఖర్చు, సమయం వెచ్చించి వచ్చిన మామ కృషి, కోడలికి సర్పంచ్ పీఠాన్ని దక్కించింది. ఇది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటుకు ఉండే విలువను స్పష్టంగా నిరూపించింది.












Click it and Unblock the Notifications